breaking news
Chain thieves
-
నలుగురు గొలుసు దొంగల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ రెండేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నలుగురు సభ్యుల ముఠాను సీసీఎస్, నెల్లూరు నాల్గో నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.16 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఓఎస్డీ టీపీ విఠలేశ్వర్ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని పొదలకూరురోడ్డు ప్రగతినగర్ మూడో వీధికి చెందిన రామిశెట్టి ఆంజనేయులు, కోటమిట్టకు చెందిన ఎస్కే నసీర్, ఒంగోలు పట్టణం గొడుగుపాళెంకు చెందిన ఎస్కే శివశంకర్, నెల్లూరు పొదలకూరురోడ్డు ఇందిరానగర్‌కు చెందిన మనోహర్ రాజేష్‌కుమార్ స్నేహితులు. చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసైన వీరు చిల్లర నేరాలకు పాల్పడేవారు. అయితే వీరి ఖర్చులకు అవి చాలకపోవడంతో గొలుసు దొంగతనాలు ప్రారంభించారు. మోటారు సైకిళ్లను దొంగలించి వాటిలో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులను తెంపుకెళ్లి వాటిని అమ్మి సొమ్ముతో జల్సా చేస్తున్నారు. నిందితులు నెల్లూరు నగరంతోపాటు , బుచ్చి, ఇందుకూరుపేట, కావలి తదితర ప్రాంతాల్లో 2015 నుంచి గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. వీరి కదిలికలపై కొద్దిరోజులుగా సీసీఎస్, నెల్లూరు నాల్గో నగర పోలీసులు నిఘా ఉంచారు. శనివారం నిందితులు నలుగురు దొంగలించిన బైక్‌లపై వాహాబ్పేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్న సమాచారం అందింది. దీంతో సీసీఎస్, నాల్గోనగర ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, వి.సుధాకర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి నిందితులపై దాడి చేసి అదుపులోకి తీసుకుని విచారించగా, పలు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రూ. 16 లక్షలు విలువ చేసే 70 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఆంజనేయులు, నసీర్, శివశంకర్ పాతనేరస్తులు. సిబ్బందికి అభినందన గొలుసు దొంగల ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషి చేసిన సీసీఎస్, నాల్గో నగర ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, వి.సుధాకర్‌రెడ్డి, నాలుగు, సీసీఎస్ ఎస్సైలు ఎస్కే అలీసాహెబ్, కె.రామకృష్ణ, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్స్ వి.గిరిధర్‌రావు, జె. సురేష్‌బాబు, ఎస్.వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ వై. సుధాకర్, జీవీ రమేష్, ఎస్కే గౌస్‌బాషా, ఎస్కే జిలాని, జి.వేణు. సీహెచ్ శ్రీనివాసులు, హెచ్ జి రామాంజనేయరెడ్డిలను ఓఎస్డీ అభినందించారు. నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. త్వరలో ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. సీసీఎస్ డీఎస్పీ ఎం. బాలసుందరరావు, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీసీఎస్, నాల్గోనగర ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, వి. సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కర్నూలులో హై అలర్ట్
►దొంగల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ► నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ ►ఐదు స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు ►బాధితులను కలసి వివరాలు తెలుసుకున్న ఎస్పీ కర్నూలు: వరుస దొంగతనాల నేపథ్యంలో ఎస్పీ ఆకె రవికృష్ణ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. గొలుసు దొంగలు చెలరేగిపోతున్నా పట్టుకోలేకపోతున్నారంటూ నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శివారు కాలనీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. 12 టీములను ఏర్పాటు చేసి ఐదుగురు ఎస్ఐలు, ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇన్చార్జి డీఎస్పీ మనోహర్‌రావు తన ఛాంబర్లో నగర సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై నేరాల నియంత్రణపై చర్చించారు. నగర పరిధిలోని మొత్తం 5 పోలీస్స్టేషన్లు ఉండగా, ఒక్కొక్క స్టేషన్ పరిధిలో మూడు టీమ్‌లను నియమించారు. ఎస్ఐల ఆధ్వర్యంలో వాహనాలు, నగరంలోని లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మొత్తం రోడ్లపైనే ఉండి గస్తీ విధులు నిర్వహించే విధంగా ఎస్పీ ఆదేశించడంతో అధికారులు రోజంతా కాలనీల్లో పర్యటించారు. అర్బన్ తాలుకా సీఐ మధుసూధన్‌రావు బాలాజీనగర్, సంతోష్‌నగర్, నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు ఆధ్వర్యంలో క్రిష్ణానగర్ ప్రాంతంలోను, మూడవ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీక్యాంప్ సెంటర్ వరకు తన సిబ్బందితో ఇరువైపుల కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి అనుమానం ఉన్న ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. నెంబర్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కుని వెళ్లే దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ముద్రించిన కరపత్రాలను కాలనీల్లో పర్యటిస్తూ పంపిణీ చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ, ఓఎస్డీ మనోహర్‌రావు రాత్రి బి.క్యాంప్‌లోని రిటైర్డ్ ఎస్ఐ ఆంజనేయులు, మణెమ్మ దంపతుల ఇంటికి వెళ్లి చైన్ స్నాచింగ్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా రికవరీ చేయాలంటూ బాధితుడు ఆంజనేయులు ఈ సందర్భంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేయిస్తానని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు.