పైసలిస్తేనే.. పాస్‌బుక్‌! | pass books pending in tahasildar office demanding bribery | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే.. పాస్‌బుక్‌!

Jan 13 2018 11:56 AM | Updated on Apr 4 2019 2:50 PM

పర్చూరు: పట్టాదారు పాసుపుస్తకాలకు ఎంతో కొంత ముట్టజెప్పందే మంజూరయ్యే పరిస్థితులు తహశీల్దారు కార్యాలయాల్లో కనిపించటం లేదు. ఇది రెవెన్యూశాఖలో బహిరంగ రహస్యం. అడంగల్‌లో పేరు మార్పు నుంచి.. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరయ్యే వరకు రెవెన్యూ కార్యాలయాల్లో ‘దక్షిణ’లు సమర్పించుకోవాల్సిందే.. లేకుంటే సవాలక్ష కొర్రీలె పెట్టి పాసు పుస్తకం కోసం పెట్టిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. రెవెన్యూలో ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించేశారనే ఆరోపణలు నిపిస్తున్నాయి.

భూమిపై యాజమాన్య హక్కును కల్పించే పట్టాదారు పాసుపుస్తకం రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తోంది. భూముల  ధరలు పెరగడంతో పట్టాదారు పాసుపుస్తకం అనివార్యమైంది. ఇదే అదునుగా రెవెన్యూశాఖలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి దుకాణం తెరిచేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మీ సేవాలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెవెన్యూ సిబ్బందిని సంతృప్తి పరచకపోతే తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అడంగల్‌ పేరు మార్పు నుంచే...!
భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్యాత రెవెన్యూ రికార్డుల్లోని అడంగల్‌లో పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత ఫైలు వీఆర్వోల పరిశీలనకు వెళుతుంది. ఇక్కడ నుంచే అసలైన కథ మొదలవుతుంది. ఏవరైతే దర ఖాస్తు చేసుకున్నారో వారు వీఆర్వోను కలిసి చేతులు తడపకపోతే కొద్దిరోజుల పాటు పెండింగ్‌ ఉంచి అనంతరం తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అడంగల్‌ పేరు మార్పు కాకుండా పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉండడంతో దరఖాస్తుదారులు రెవెన్యూ అధికారులకు సంతర్పణలు చేసుకుంటున్నారు.  తహశీల్దారు కార్యాలయాల్లోని వీఆర్వోలు అన్నీ సక్రమంగా ఉంటే వెయ్యి రూపాయిల నుంచి 5 వేలు వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదే వివాదాస్పద భూములకైతే రూ. 20 వేలు సమర్పించిన తర్యాతే అడంగల్‌ లో పేరు మార్పు, అనంతరం పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అవుతోందనే ప్రచారం జరుగుతోంది.

క్షేత్రస్థాయి పరిశీలన కరువు..
పట్టాదారు పాసుపుస్తకం మంజూరుకు తహశీల్దారు స్థాయి అధికారి నేరుగా సంబంధిత పొలాన్ని పరిశీలించాలి. ఈ విధానం అమలు కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వో లే అన్ని పనులు చక్కబెట్టి సీటుకు ఒక రేటు ప్రకారం అందించేస్తున్నారు. దీంతో అధికారులు కార్యలయాలకే పరిమితమై సంతకాలతో పని ముగించేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతికంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రెవెన్యూ వ్యవస్థకు పట్టిన అవినీతి కంపు మాత్రం వీడడం లేదు. ఈ విషయంపై ఆర్డీవో శ్రీనివాసరావును వివరణ కోరగా పట్టాదారు పాసుబుక్‌లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకు వారాలని, తాము సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement