గులాబీ.. గుబాళింపు! 

ZPTC And MPTC Results TRS Party Winning Josh In Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ.. గుబాళించింది. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ తొలిసారి జిల్లా పరిషత్‌ పీఠంపై గులాబీ జెండాను ఎగుర వేయనుంది. 31  జెడ్పీటీసీ (జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు) స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ ఏకంగా 24 చోట్ల విజయ దుందుభి మోగించింది.  గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్‌ కేవలం 7 జెడ్పీటీసీ స్థానాలకే పరిమితం కాగా, ఇతర ఏ పార్టీ ఖాతా తెరవలేదు. ఇక, ఎంపీటీసీల (మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ) విషయానికి వస్తే.. జిల్లా వ్యాప్తంగా 349 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 191 స్థానాలతో పట్టు నిరూపించుకుంది. మొత్తంగా 31 మండల ప్రజాపరిషత్‌లకు గాను ఆ పార్టీ ఇప్పటికిప్పుడు 18 ఎంపీపీ స్థానాలను  కైవసం చేసుకున్నట్టే. కాంగ్రెస్‌కు ఆరు మండలాలే దక్కనుండగా,  మరో ఏడు మండలాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఎంపీపీ పదవులను పొందేందుకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈనెల 7వ తేదీన, జిల్లా పరిషత్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక 8వ తేదీన జరగనున్నాయి.

ఉసూరుమన్న కాంగ్రెస్‌
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌ ఆనందమంతా స్థానిక సంస్థల ఫలితాలతో ఆవిరైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ... ఈ మూడు రెవెన్యూ డివిజన్లలో ఎక్కడా పట్టు నిరూపించలేక పోయింది. దేవరకొండ డివిజన్‌లో పది మండలాలకు గాను కేవలం పీఏపల్లిలో మాత్రమే జెడ్పీటీసీ స్థానాన్ని గెలచుకుంది. మిర్యాలగూడ డివిజన్‌లోని పది మండలాలకు గాను.. మాడ్గులపల్లి, త్రిపురారం, నిడమనూరు జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచింది. ఇక, నల్లగొండ డివిజన్‌ పరిధిలోని పదకొండు మండలాల్లో నల్లగొండ, చండూరు, కేతేపల్లి జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్‌ వశమయ్యాయి. ఎంపీపీల విషయంలోనూ కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు తప్పలేదు. దేవరకొండ డివిజన్‌లో చందంపేట, కొండమల్లేపల్లి, చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో, మిర్యాలగూడ డివిజన్‌లో త్రిపురారం, నల్లగొండ డివిజన్‌లో నల్లగొండ మండలాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. దీంతో మొత్తంగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏడు జెడ్పీటీసీ స్థానాలు, ఆరు ఎంపీపీ పదవులు దక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం 5, బీజేపీ 4, సీపీఐ 1 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా, స్వతంత్రులు/రెబల్స్‌ .. 14 చోట్ల గెలిచారు. కాంగ్రెస్, ఇతరులు పొత్తులతో పోటీ చేసిన కొన్ని మండలాల్లో కాంగ్రెస్‌ ఎంపీపీ స్థానా న్ని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ నెల 7వ తేదీన జరగనున్న ఎంపీపీల ఎన్నికల్లో ఏ పార్టీ అవకాశం దక్కుతుందో తేలనుంది.

ఆ ఏడు .. ఎవరికి ?
జిల్లాలోని 31 మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని 18 చోట్ల టీఆర్‌ఎస్, 6 చోట్ల కాంగ్రెస్‌ ఎంపీపీ పదవులు పొందడం ఖాయంగా కనిపిస్తుండగా.. మరో ఏడు చోట్ల మాత్రం ఇరు పార్టీలకూ సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడు మండలాలు ఏ పార్టీ ఖాతాలో చేరుతాయనే చర్చ మొదలైంది. పెద్దవూర, వేములపల్లి, చండూరు, చిట్యాల, తిప్పర్తి, కేతేపల్లి, నకిరేకల్‌ మండలాల్లో అటు టీఆర్‌ఎస్‌కు గానీ, ఇటు కాంగ్రెస్‌కు గానీ ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ రాలేదు. ఈ ఏడు మండలాల్లో ఇండిపెండెంట్లు , సీపీఎం, ఇతరులు కీలకం కానున్నారు. సహజంగానే.. అధికార పార్టీ ఈ ఏడు ఎంపీపీలను కైవసం చేసుకునేందుకు మంతనాలు మొదలు పెట్టింది. కొన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంపీటీసీ టికెట్లు దక్కని వారే రెబల్స్‌గా పోటీ చేసి గెలవడంతో వారు తమకే మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top