అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం  | YSRCP MLAs Fires On TDP | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

Jul 24 2019 4:15 AM | Updated on Jul 24 2019 4:15 AM

YSRCP MLAs Fires On TDP - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని, బడుగు, బలహీనవర్గాలు, మహిళలకు మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు యత్నించడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు మేలు చేసే బిల్లులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వారి మనసుల్లో సుస్థిర స్థానం పొందారన్నారు. జగన్‌కు మంచి పేరొస్తుందనే టీడీపీ రాద్దాంతం చేస్తోందన్నారు.

- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గొప్ప ఆశయంతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సభలో బిల్లు పెడితే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాము. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి బిల్లు ఏ మహానుబావుడు తెస్తారా? అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎదురు చూస్తున్నారు.   
 – మడకశిర ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామి 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలపై దేశం మొత్తం హర్షిస్తోంది. ఏపీ శాసనసభను నడిపిస్తున్న తీరుని కర్ణాటక అసెంబ్లీలో న్యాయశాఖా మంత్రి కృష్ణ బైరెగౌడ ప్రస్తావిస్తూ.. ఎంత గొడవ చేస్తున్నా సభ్యులకు అవకాశం కల్పిస్తూ ఏపీ అసెంబ్లీని చక్కగా నడుపుతున్నారని ప్రశంసించారు.  
– కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌

సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతుంటే, ఏవేవో కారణాలు చెప్పి గొడవ చేస్తున్న టీడీపీ సభ్యుల క్రమశిక్షణ, నిబద్ధత ఏపాటిదో ప్రజలు గమనిస్తున్నారు.  
– శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి 

సభ ప్రారంభం నుంచి ప్రతిపక్ష సభ్యులు ఒక పేపర్‌ కటింగ్‌ తెచ్చి జగన్‌ 45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్‌ ఇస్తానన్నారని, దాని సంగతి చెప్పమని గొడవ చేశారు. ఆ పేపరు వార్త 18–10–2017 తేదీన ప్రచురితమైంది. తరువాత 2018లో వైఎస్‌ జగన్‌ అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ వైఎస్సార్‌ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలుకుతున్నట్టు ప్రకటించారు.  దాన్ని సభలో సైతం ప్లే చేశారు.  
– అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ 

తొలిసారి సభలో అడుగుపెట్టిన మేము, ప్రజాసమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకుందామని అనుకున్నాము. సామాజిక న్యాయం, సమçసమాజం అంటూ నీతులు వల్లించే ప్రతిపక్ష టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు మేలు చేసే బిల్లులు అడ్డుకోవడం సమర్థనీయం కాదు.  
– సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

 మీ తోలు తీస్తా, దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అని బలహీన వర్గాలను చంద్రబాబు కించపరచడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అదే బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ, జీవనస్థాయి పెరిగేలా చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మహోన్నత సంకల్పాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్‌ పదవుల్లోను, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలనే విషయాన్ని 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ గానీ, 60 ఏళ్ల చరిత్ర కలిగిన బీజేపీగానీ, 30 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీగానీ ఎప్పుడైనా ఆలోచించాయా? గొప్ప నిర్ణయాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళితుల చాంపియన్‌గా నిలిచిపోతారనే భయం టీడీపీకి పట్టుకుంది.    
– పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి  

టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం గతంలో టీడీపీకి కేంద్రంలో అవకాశం వచ్చిన రెండు మంత్రి పదవులనూ అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరికి ఇచ్చిన టీడీపీకి బీసీల గురించి మాట్లాడే అర్హతలేదు.  – మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 

బీసీ కమిషన్‌ బిల్లు వారికి భరోసా కల్పిస్తుంది. ఈ కమిషన్‌కు విస్త్రత అధికారాలు ఉంటాయి. హైకోర్టు న్యాయమూర్తి పరిధిలో పనిచేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో అనేక మంది పేద విద్యార్థులు బాగుపడ్డారు. ఈ బిల్లును అడ్డుకోవడం తగదు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రజలు క్షమించబోరు.
       – ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్‌ 

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి  తీసుకువచ్చిన ఈబీసీ రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలి. వివిధ కోర్సులకు ప్రస్తుతం జరగనున్న కౌన్సెలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని వెంటనే విధివిధానాలను రూపొందిస్తే, ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉంటుంది. 
         – ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసరెడ్డి కోరారు.

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కాకపోవడానికి, కేంద్రానికి సంబంధం లేదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో రైతులు టీడీపీ ప్రభుత్వంపై అనేక ఫిర్యాదులు చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్న టీడీపీ ప్రభుత్వానికి రుణం ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు రావచ్చనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.
 – బీజేపీ ఎమ్మెల్సీ వేణుమాధవ్‌  

- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని అమలు చేయాలి. 1,741 వ్యాధులకు దీన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లోనూ అమల్లోకి తీసుకురావాలి.
    – ఎమ్మెల్సీ రాము సూర్యారావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement