ఏపీకి పట్టిన వైరస్‌ చంద్రబాబు

YSRCP MLA Musthafa Says Chandrababu Is Virus For AP - Sakshi

వికేంద్రీకరణ అంశంలో టీడీపీ నేతల తీరు సిగ్గుచేటు

నిరసన దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ప్రారంభించిన ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి

సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌లా...ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు పట్టి పీడిస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చంద్రబాబు వైరస్‌లా వ్యాపించి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ అంశంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గురువారం గుంటూరు తాలూకా కార్యాలయం ఎదుట పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోరే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి  చెందాలనే లక్ష్యంతో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలు చెబుతున్నారన్నారు. పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు  లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తిరగటం తప్ప చంద్రబాబు చేసింది ఏముందని ప్రశ్నించారు. మూడు రాజధానులే ముద్దు అని ప్రజానీకం గొంతెత్తి చాటుతోందన్నారు.  

పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ చంద్రబాబుకు దిగజారుడు రాజకీయాలు చేయటం కొత్తేమీ కాదన్నారు. సిగ్గుఎగ్గు లేకుండా స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), మార్కెట్‌బాబు, సోమికమల్, అంగడి శ్రీనివాసరావు, శ్రీనివాస్‌యాదవ్, గనిక ఝాన్సీ, మేరిగ విజయలక్ష్మి, విఠల్, వలి, రవి, జగదీష్, డివిజన్‌ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top