టీడీపీ ప్రచారంలో వాస్తవం లేదు

 YSRCP MLA Alla Rama Krishna Reddy clarified doughts on capital - Sakshi

రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు మద్ధతిచ్చాం

చంద్రబాబు అక్రమ సంపాదనకే వైఎస్ఆర్‌సీపీ అడ్డు

భూములిచ్చిన రైతులకు అండగా ఉంటాం

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

సాక్షి, మంగళగిరి: అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని నిర్మాణం చేప‌డతామ‌ని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండేళ్ల క్రిత‌మే చెప్పార‌ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వం భూసేకరణ నోటీసును ప్రకటించటంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. రాష్ట్ర రాజధానికి, పోలవరానికి వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ అడ్డుకాదని, ఈ రెండింటి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే అవినీతికి మాత్రమే అడ్డు అని ఆర్కే స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఆర్కే రైతులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానికి, పోలవరానికి వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకమంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతానికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. భూములిచ్చిన రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని, రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుందని రెండేళ్ల క్రితం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి చంద్రబాబు సర్కారు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వెనక్కి ఇచ్చేందుకు సైతం వెనుకాడబోమని వైఎస్ జగన్‌ తెలిపారని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు అసలు ప్రతిపాదనలను చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని, దాన్ని ఆయన కుమారుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ అడ్డుకోవడం జరుగుతుందా అంటూ ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.

రాజధాని, పోలవరం పేర్లతో కోట్ల రూపాయిలు దండుకుంటున్న చంద్రబాబు అక్రమ సంపాదనకే వైఎస్ఆర్‌సీపీ అడ్డు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తానంటే ప్రపంచ బ్యాంకు వద్దకు ఎందుకు అప్పు కోసం వెళ్తున్నారని చంద్రబాబు సర్కారును నిలదీశారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. వాటికి సమాధానం చెప్పకుండా వైఎస్ఆర్‌సీపీని విమర్శించడం పద్ధతి కాదని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top