వైఎస్‌ ఉంటే పోలవరం పూర్తయ్యేది: ఎంవీఎస్‌

YSRCP Leader MVS Nagi Reddy Slams Chandrababu In Vijayawada - Sakshi

విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవించి ఉంటే పోలవరం ఈపాటికి పూర్తయ్యి ఉండేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చాలా వరకు పోలవరం పనులు వైఎస్‌ఆర్‌ హయాంలోనే పూర్తయ్యాయని, చంద్రబాబు చేతగాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని విమర్శించారు. జాతీయ హోదాకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకువచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చంద్రబాబులా డబ్బా ప్రచారం చేసుకోలేదనీ, చంద్రబాబు మాత్రం తానే పోలవరం నిర్మాతనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

12 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని గతంలో సీఎం చంద్రబాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయం మరిచిపోయి ఇరిగేషన్‌ మంత్రి మాట్లాడుతున్నారుని అన్నారు. ట్విన్‌ టన్నెల్స్‌ 25 శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇవి పూర్తి కాకుండా కుడి కాలువకు గ్రావిటీ ద్వారా నీరు ఎలా ఇస్తారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే వచ్చే ఐదేళ్లకు కూడా పోలవరం పూర్తి కాదని వ్యాఖ్యానించారు.

కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయలేని చంద్రబాబు ఎలా పోలవరం పూర్తి చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హయంలోనే ఆల్మట్టి అక్రమ నిర్మాణం జరుగుతున్నా కుంభకర్ణుడిలా నిద్రపోయారని అన్నారు. వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఊపిరి పోశారని వ్యాఖ్యానించారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించనున్నారని, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబు వంచనలను ప్రజలు నమ్మె స్థితిలో లేరని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top