చంద్రబాబు చుట్టూ మోసగాళ్లే

Ysrcp leader Kolusu Parthasarathy fire on ap cm chandra babu naidu - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజం 

జగన్‌పై చేసిన ఆరోపణలు చంద్రబాబు నిరూపించగలరా? 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ అంతా మోసగాళ్లే ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ఒక్క మంచి పని అయినా చేశామని చెప్పుకోలేక వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. 

మీడియా అండతో బాబు బతుకుతున్నాడు 
‘‘హిందూజా సంస్థ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట 11 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్‌ చేసిందని అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమని చంద్రబాబు నిరూపించగలరా? ఆ భూమి ఎక్కడ ఉందో చూపించాలి. అది అబద్ధం అయితే బాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? దీనిపై 24 గంటల్లో సమాధానం చెప్పాలి. తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం చూస్తే చంద్రబాబు ఓటమి భయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈడీ, సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చంద్రబాబు వద్దకు ఎలా చేరాయో చెప్పాలి. దానిపై విచారణ జరపాలి. ప్రతిపక్ష నేత జగన్‌పై అక్రమ కేసులు పెట్టడానికి, సంబంధం లేని కేసుల్లో ఇరికించడానికి, అవకాశం వస్తే విచారణలో కూడా వేలు పెట్టి ఇబ్బందులు సృష్టించడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నారు. ఐదేళ్లపాటు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రి తన పార్టీలో ఉన్న దొంగలను కాపాడుకుంటూ మీడియా సపోర్ట్‌తో బతుకుతున్నారు. మోసగాళ్లంతా టీడీపీలో చంద్రబాబు పక్కనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలు  ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. నామా నాగేశ్వరరావు మధుకాన్‌ సంస్థ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన తీరు గురించి ప్రజలకు తెలుసు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో ముడుపుల బాగోతం గురించి బయటపెడతానని రాయపాటి లాంటి వాళ్లు భయపెట్టే స్థాయికి వచ్చారంటే ఆ పార్టీ నేతలు ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చు’’ అని కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికితే నిరోధిస్తారా? 
‘‘‘ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియక జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు అబద్ధాలు, అసత్యాల ప్రచారానికి పూనుకున్నారు. తిరుమల మహాద్వారం ప్రవేశం విషయంలో హైందవ ధర్మాన్ని కాపాడే పీఠాధిపతులకు ప్రవేశం లేకుండా జీఓలు జారీ చేశారు. రాజకీయ నేతలు మహాద్వార ప్రవేశం చేయడంలో వివాదాలు లేవు గానీ, అనుకూలంగా లేరనో, బ్రాహ్మణులలో అత్యధికంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతున్నారనో పీఠాధిపతులను నిరోధించేందుకు ఇలాంటి జీఓలు జారిచేయడం చంద్రబాబుకే చెల్లింది’’ అని పార్థసారథి మండిపడ్డారు.  

చంద్రబాబు విచారణకు  సిద్ధమా? 
‘‘మనోజ్‌ కొఠారి అనే చిన్నస్థాయి వైఎస్సార్‌సీపీ నేత బీజేపీ గురించి ఏదో మాట్లాడితే దాన్ని స్టింగ్‌ ఆపరేషన్‌ పేరిట తన అనుకూల పత్రికల్లో ప్రధానంగా ప్రచురింపజేసి దుష్ప్రచారం చేయాలనే స్థాయికి చంద్రబాబు దిగజారారు. చంద్రబాబు దోపిడీపై గతంలో కాంగ్రెస్‌ పార్టీ పుస్తకాలను ప్రచురించింది. వైఎస్సార్‌సీపీ కూడా సాక్ష్యాలు, జీఓలతో సహా చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల దోపిడీపై పుస్తకాన్ని ప్రచురించింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించుకోవాలి. నిజాయతీపరుడిగా బయటకు రాగలిగే దమ్ము ఉంటే విచారణకు సిద్ధం ఉండాలి’’ అని కొలుసు పార్థసారథి డిమాండ్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top