‘హోదాకు ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా తీసుకుంటాం’

YSRCP Leader Botsa Satyanarayana Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చిన తీసుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్  ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్యాకేజీ కావాలని గోల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని హోదా అని నాటకాలు ఆడితే ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇస్తామంటే..నిరసనలు చేయమని చెబుతారా అని మండిపడ్డారు. టీడీపీ నిరసనలకి ప్రజలు ఎవరు రాలేదన్నారు.  హోదాకు పక్కరాష్ట్రాలు మద్దతు ఇస్తే తప్పేంటేని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రభుత్వంతోనే వైఎస్సార్‌సీపీ కలిసి వెళ్తుందని స్పష్టం చేశారు.

‘ప్రత్యేక హోదా మీకు(చంద్రబాబు నాయుడు) అవసరం లేదేమో కానీ.. మాకు మా రాష్ట్ర ప్రజలకు హోదా అవసరం. మీరు(చం‍ద్రబాబు), మీ కొడుకు(లోకేష్‌) నల్ల చొక్కాలు వేసుకుంటే అది హోదా కోసం పోరాటం చేసినట్లా?  నాలుగేళ్లు మతతత్వ బీజేపీ పార్టీతో జత కట్టి ముస్లింల మనోభావాలు దెబ్బతీసి..ఇప్పుడు ఫరూఖ్‌ అబ్దుల్లాను తీసుకొస్తే ముస్లింలు ఓట్లు వేస్తారనుకోవడం చంద్రబాబు భ్రమ. ఇకనైనా ఈ జిమ్మిక్కులు ఆపండి. దమ్ము, చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం అభివృద్ధి చేసారో శ్వేతపత్రం విడుదల చేసి దానిపై ప్రచారానికి వెళ్లండి. అంతే కానీ రాజకీయాలు మాట్లాడి ప్రజలని మభ్య పెట్టి, ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నించకండి’ అని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని, సంక్షేమ రాజ్యాన్ని తీసుకురావడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top