ఆ లాకర్లలో ఏమి దాచారో చెప్పాలి: అంబటి

YSRCP Leader Ambati Rambabu Fires On CM Ramesh - Sakshi

సాక్షి, విజయవాడ : సీఎం రమేశ్‌ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికార టీడీపీకి భయమెందుకని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఐటీ దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేశ్‌ చంద్రబాబు నంబర్‌వన్‌ బినామీ అని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు రమేశ్‌కు లేదన్నారు. సీఎం రమేశ్‌ మీసం మెలేస్తే ఐటీ అధికారులు తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 

రిత్విక్‌ సంస్థ ఎప్పుడైనా భారీ కాంట్రాక్టు చేసిందా అని ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్‌ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని ఆరోపించారు. ఆయన జీవిత భాగస్వామికి, కుటుంబీకులకు తెలియకుండా వేలిముద్ర ఉంటేనే తెరుకునే లాకర్లు ఉండటమేంటని ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమి దాచారో చెప్పాలన్నారు. సీఎం రమేశ్‌ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్‌ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఇవన్ని చేస్తూ మీసం మెలేస్తున్నారని.. పచ్చకాలం అంటే ఇదేనని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు, తేడా ఎక్కడ వచ్చిందో విడిపోయారని విమర్శించారు. సీఎం రమేశ్‌ సారా కాంట్రాక్టర్‌ దశ నుంచి ఎంపీ స్థాయికి రావడానికి గెస్ట్‌హౌజ్‌ రాజకీయాలే కారణమని ఆరోపించారు. పచ్చకాలం ఎక్కువ కాలం ఉండదని, ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top