అచ్చెన్నాయుడుని తరిమి కొట్టే రోజు త్వరలోనే..

సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం): కోటబొమ్మాళిలో పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడికి పాల్పడటం సిగ్గుచేటని పేర్కొంది. ఈ దాడికి నిరసనగా శుక్రవారం కొత్తపేట నుంచి కోటబొమ్మాళి మార్కెట్‌ వరకు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌, సీనియర్‌ నేతలు తమ్మినేని సీతారం, ధర్మాన కృష్ణ దాస్‌, టెక్కలి అసెంబ్లీ సమన్వయ కర్త పేరాడ తిలక్‌, పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. 

శాంతి ర్యాలీలో పాల్గొన్న అనంతరం వైఎస్సార్‌ సీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞతతో ఉండాలని, ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు నేర చరిత్ర కలిగిన వారని, ఆయనను తరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అచ్చెన్నాయుడుని ఈడ్చి ఈడ్చి కొట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నాయకులు కవ్వింపులకు పా​ల్పడటం తగదని, కోటబొమ్మాళి ఎస్‌ఐ, టెక్కలి సీఐలు అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వారిపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. అచ్చెన్నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కోటబొమ్మాళి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top