దొంగల రాజ్యం ఇంకా అవసరమా?

YS Jaganmohan Reddy fires on chandrababu govt - Sakshi

మట్టి, ఇసుక, మద్యం మొదలు అమరావతి, దేవాలయ భూముల దాకా అంతటా అవినీతే 

ముఖ్యమంత్రే పై స్థాయిలో తినేస్తున్నారు.. 

జన్మభూమి కమిటీల పేరుతో ఊరూరా మాఫియా 

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ప్రజా సంకల్పం పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘రాష్ట్రంలో మట్టి, ఇసుక, మద్యంతో పాటు అమరావతి భూముల నుంచి దేవాలయ భూ ముల దాకా అన్నింటా అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు  ప్రభుత్వం ఓ మాఫియాగా మారింది. జన్మభూమి కమిటీల పేరుతో ఆ మాఫియాను గ్రామ గ్రామానికీ విస్తరించారు. ఆ కమిటీ సభ్యులకు లంచం ఇవ్వం దే ఏ పనీ జరగని దుస్థితి నెలకొంది. దారుణమైన రీతిలో దొంగల రాజ్యం సాగుతోంద’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా 26వ రోజు సోమవారం అనంతపురం జిల్లా గుత్తిలోని గాంధీ చౌక్‌లో జరిగిన భారీ బహిరంగసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలను కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కారు ఇంకా ఎంత వరకు అవసరమో ఆలోచించాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

సమస్యలు వింటుంటే బాధేసింది.. 
‘‘గుత్తిలో ఇవాళ పాదయాత్ర చేస్తూ వస్తున్నపుడు ఎందరో సమస్యలతో నా వద్దకు వచ్చారు. దాదాపు ఆరు నెలలుగా మాకు జీతాలు లేవన్నా... అని మోడల్‌ స్కూలు టీచర్లు నా దృష్టికి తెచ్చారు. పిల్లలకు చక్కగా చదువులు చెప్పే ఉదాత్తమైన లక్ష్యంతో మండలానికొక మోడల్‌ స్కూలును కేంద్రం సహకారంతో గతంలో స్థాపించారు. అలాంటి స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఆరు నెలలుగా ఇవ్వక పోతే వారెలా జీవిస్తారు? పిల్లలకు చదువు ఎలా చెబుతారు? ఇక పిల్లలేమవుతారు? అనే ఇంగిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. గుత్తి మున్సిపాలిటీ కార్మికులు నాదగ్గరకు వచ్చి గత మూడు నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వడం లేదన్నా... అని ఆవేదన వ్యక్తం చేశారు.

గుత్తిలో ఉన్న ఉర్దూ స్కూలులో పిల్లలకు అన్నం వండే పని చేస్తున్న ఆయాలు కూడా వచ్చారు. ‘అన్నా... ఆరు నెలల నుంచి పిల్లలకు అన్నం వండిపెడుతున్నాం.. మాకింత వరకూ ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదన్నా..  నిన్నటి రోజున స్కూలు పిల్లలకు అన్నం వడ్డించడం కోసం చెవి కమ్మలు కూడా అమ్మేశామన్నా...’ అని వారు చెబుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని ఎన్నికలపుడు చెప్పిన చంద్రబాబు తన మీద కేసులు రాకూడదని, విచారణ జరక్కూడదని ప్రత్యేక హోదాను ఆ తరువాత తెరమరుగు చేశారు. హోదా ఉంటేనే మన పిల్లలకు కాస్తో కూస్తో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి దానిని కూడా అమ్మేశాడు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా విచ్చలవిడిగా అవినీతి కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం మట్టి నుంచి ఇసుక దాకా.. మద్యం నుంచి కాంట్రాక్టుల దాకా.. రాజధాని భూములు, ఆలయ భూములు.. ఇలా దేన్నీ వదలడం లేదు. చంద్రబాబు పైన తినేస్తా ఉంటే కింది స్థాయిలో గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలు మాఫియాలు గా తయారై తినేస్తున్నాయి. పింఛన్లు, రేషన్‌ బియ్యం, మరుగుదొడ్లు కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లోకి పాలన వెళ్లి పోయింది.  

రైతులు, విద్యార్థులు, అక్క, చెల్లెళ్లకు భరోసా  
చంద్రబాబు పాలనలో సంక్షోభంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి, చదువుకుంటున్న పిల్లలకు తోడుగా ఉండేందుకే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నాను. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల పథకా>లతో ముందుకెళతాను. పేద పిల్లలను చదివించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టి వైఎస్‌ ఒక అడుగు ముందుకు వేశారు. నేను రెండడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను కాలేజీలకు పంపించండి చాలు.. నేను వారిని ఇంజినీరింగ్, డాక్టర్‌ కోర్సులు చదివిస్తా.. మొత్తం ఫీజులు చెల్లించడమే కాకుండా వారికి మెస్‌ చార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను. పెద్ద చదువులు చదవడానికి చిన్న పిల్లల చదువులు పునాది. అందుకే తల్లులు తమ పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15,000 ఇస్తాం. పింఛన్లు రూ.2000 చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారికి పింఛను పొందే వయసును 45 ఏళ్లకే తగ్గిస్తున్నాను. ఈ సంక్షేమ పథకాలన్నీ పొందడానికి జన్మభూమి కమిటీల వద్దకు పోవాల్సిన పని లేదు. స్థానికంగా గ్రామ సచివాలయాలను నెలకొల్పి 72 గంటల్లో మంజూరయ్యేలా చూస్తాను.’’అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

అడుగడుగునా జనమే జనం 
రెండు జిల్లాల్లో ప్రజాసంకల్పం పాదయాత్ర ముగించుకుని సోమవారం అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ప్రవేశించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. బసినేపల్లి మొదలు గుత్తి దాకా అడుగడుగునా ఆయన్ను కలుసుకునేందుకు గుంపులు గుంపులుగా జనం కదలి వచ్చారు. రహదార్లకు ఇరువైపులా ఉన్న గ్రామాల నుంచి సామాన్య జనం, ముఖ్యంగా అక్కచెల్లెళ్లు, అవ్వా తాతలు, యువకులు ఆసక్తిగా బయటకు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తూ నించున్నారు.  చాలా చోట్ల ఉద్యోగులు, కుల సంఘాల వారు, విద్యార్థులు జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. బసినేపల్లి హరిజన కాలనీ మహిళలు ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ తమకు వారాల తరబడి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రారంభంలోనే ఘనస్వాగతం పలికాయి. 

ప్రతి కులాన్నీ మోసం చేశారు 
రాష్ట్రంలోని ఏ కులాన్ని వదలకుండా చంద్రబాబు మోసం చేశారు. ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. నిన్న గాక మొన్న అసెంబ్లీలో కూడా తాజాగా ఆయన మోసాన్ని మళ్లీ చూశాం. బోయలను ఎస్టీలుగా చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారట. వెంటనే చంద్రబాబు కార్యాలయం నుంచి ‘అందరూ కేకులు కట్‌ చేయండి.. పంచుకోండి’ అని కింది స్థాయి వరకు ఫోన్లు వెళ్లాయి. ఇలాంటి తీర్మానాలు ఎన్నిసార్లు చేసి ఢిల్లీకి పంపిస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఇప్పటికి మూడు సార్లు తీర్మానం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బోయలను, కురువలను అధికారంలోకి రాగానే ఎస్టీలుగా చేసేస్తాం అని హామీ ఇచ్చారు. ఇవాళేమో ప్రయత్నం చేస్తామంటున్నారు. కేంద్రానికి పంపించాను అంటున్నారు. నిజంగా చంద్రబాబు అంతటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నిస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంపైకి నెపం నెట్టి మోసాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా మోసగిస్తూనే కేకులు కట్‌ చేసుకోండి అని చెబుతూ ఉన్నారు. నేనొకటే చెబుతున్నా..  కాపుల విషయంలో కూడా ఇలాగే మాట్లాడారు. మేనిఫెస్టోలో కాపులను బీసీలుగా చేసేస్తా అని హామీ ఇచ్చారు. ఎన్నికలైపోగానే ప్రయత్నం చేస్తానన్నాడు. మోసం చేయడంలో ఏ కులాన్నీ ఆయన వదల్లేదు. 

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 
పాదయాత్రలో ప్రజలిచ్చే సలహాలతోనే ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేస్తాం. చంద్రబాబు మాదిరిగా మోసం చేయడానికి ప్రతి కులానికి ఒక పేజీ పెట్టం. రెండు మూడు పేజీలే మొత్తం మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేస్తాం. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని ముఖ్యమంత్రే చెబుతున్నారు. మీరంతా ఆయన నాలుగేళ్ల పాలనను చూశారు. ఇలాంటి తరుణంలో మనల్ని మోసం చేసే, అబద్ధాలు చెప్పే నాయకుడు ఇంకా మనకు ఎంతవరకు అవసరమో ఆలోచించండి. చంద్రబాబు చెప్పింది, చేసింది మనం మరచిపోతే మళ్లీ రేపు ఎన్నికలు వచ్చినపుడు సభలు పెట్టి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, ఒక మారుతీ కారు ఇస్తానని హామీ ఇస్తారు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత రావాలి. అది జరగాలంటే హామీలిచ్చి నెరవేర్చని రాజకీయవేత్త తన పదవికి రాజీనామా చేసి వెళ్లి పోయే పరిస్థితి రావాలి. మనమంతా ఒక్కటై ఈ వ్యవస్థను మార్చేందుకు నాలుగడుగులు ముందుకు వేయాలి. మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. ఆశీర్వదించండి. అడుగులో అడుగు వేసి సహకరించండి.  

పింఛన్‌ ఇవ్వలేదన్నా.. 
అన్నా.. నా పేరు కౌసిఫ్‌ అక్తర్‌. నాకు 15 ఏళ్లు. వికలాంగ పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు..’ అంటూ ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేశాడు. ‘వైఎస్‌ అంటే నాకు చాలా ఇష్టం.. మీతో మాట్లాడాలని రెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నా..’ అని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే పింఛన్‌ వస్తుందని జగన్‌ హామీ ఇచ్చారు.  

పెద్దాయన బతికుంటే నా బిడ్డా బతికేవాడయ్యా.. 
‘పెద్దాయన బతికుంటే ఆరోగ్యశ్రీ అమలై.. నా బిడ్డ కూడా బతికేవాడయ్యా..’ అంటూ బసినేపల్లికి చెందిన సుంకమ్మ జగన్‌ ఎదుట కంటతడి పెట్టింది. ప్రజాసంకల్ప యాత్రలో సోమవారం ఆమె జగన్‌ను కలిసి ‘ఏడాది కిందట నా చిన్న కుమారుడు సూర్యకేశకు జబ్బు చేయడంతో కర్నూలు ఆస్పత్రిలో చేర్పించా. వైద్యులు పరీక్షించి గుండెకు రెండు రంధ్రాలున్నాయని, ఆపరేషన్‌ చేసి.. అయినా బిడ్డ బతకలేదని మృతదేహాన్ని నా చేతికిచ్చారయ్యా.. వైఎస్‌ బతికుంటే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని నా బిడ్డను బతికించుకునేదాన్ని’ అంటూ కన్నీళ్లపర్యంతమైంది. స్పందించిన జగన్‌ ఆమె కన్నీళ్లు తుడుస్తూ రెండో బిడ్డను బాగా చదివించాలని, త్వరలోనే మంచి రోజులొస్తాయని ధైర్యం చెప్పారు. 

రూ.14 లక్షలు ఖర్చుపెడితే నయమవుతుందన్నారు..
‘సార్‌.. నా పేరు బలరాం. మాది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని కుందనగుర్తి. నాకు వెన్నెముకపై పెద్ద గడ్డ రావడంతో పాటు సరిగా వినపడదు.. సరిగా మాట్లాడలేను కూడా. హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. రూ.14 లక్షలు ఖర్చుపెడితే తప్ప సంపూర్ణ ఆరోగ్యం రాదని వైద్యులు చెప్పారు. కానీ అంత డబ్బు నా దగ్గర లేకపోవడంతో మిన్నకుండిపోయా..’ అంటూ గుత్తి ఆర్‌ఎస్‌లో సాగిన ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన జగన్‌ వైద్య ఖర్చులను వైఎస్సార్‌ సీపీ నేతలు భరిస్తారని హామీ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top