
ప్రజా సంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు.. మోసాలు.. నాలుగేళ్లలో ఒక్క హామీనీ అమలు చేయలేదు.. పైగా 2022 నాటికి రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేస్తానంటున్నా రు. 2029 నాటికి ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తారట. అప్పుల్లో, అవినీతిలో, అబద్ధాల్లో నంబర్‌వన్ చేశారు..’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ ఏం చేస్తున్నావో చెప్పవయ్యా పెద్దమనిషీ అంటే 2050 నాటికి అది చేస్తా ఇది చేస్తా అని ఊదరగొడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 12 వ రోజైన ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా బనగానపల్లె చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో భారీ జనసమూహం మధ్య ఆయన ప్రసంగిస్తూ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, విశ్వసనీయతను పెంచేందుకు తాను చేస్తున్న పాదయాత్రకు మద్దతు ఇవ్వా లని కోరారు. నాలుగేళ్ల బాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక సమరశంఖం పూరించినట్టు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
బాబు నాలుగేళ్ల పాలనపై సమరశంఖం
‘‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై సమరశంఖం పూరిస్తూ నేను పాదయాత్ర చేపట్టాను. ఇవాళ మనస్సాక్షిగా గుండెల మీద చేయివేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి, కాబట్టి ఈ నాలుగేళ్ల పాలనలో మనకుగానీ, మన ఇంటికిగానీ, మన ఊరికిగానీ, మన రాష్ట్రానికిగానీ ఏదైనా మంచి జరిగిందా?.. బాబు పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదు. టీడీపీ పాలన వచ్చి నాలుగేళ్లైనా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎన్నికల సమ యంలో ఇచ్చిన ఏ వాగ్దాన్నైనా నెరవేర్చాడా?
రాష్ట్రం ఎందులో నంబర్ వన్?
నాలుగేళ్ల తరువాత ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో మాట్లాడుతూ..2022 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తా అంటున్నాడు. 2029 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తానని చెబుతున్నారు. మీ ఊరు సర్పంచ్ 2022 నాటికి వాటర్ ట్యాంకు కట్టిస్తానని, 2029 నాటికి రోడ్డు వేయిస్తానంటే మీరు ఏమంటారు. ‘మెంటల్ కేసు’ అంటారు కదా. చంద్రబాబు ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే ఆయన 2022, 2029కి రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తానంటాడు. ఇప్పుడే ఆయన వయసు 70 ఏళ్లు, 2029 అంటే 80 దాటిపోతుంది. ఇవాళ ఏం చేస్తున్నారో చెప్పడు కానీ, 2029, 2050 నాటికి అది చేస్తాను... ఇది చేస్తానూ అంటే నమ్ముతారా? చంద్రబాబు పాలన రైతులను, రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్ళడంలో నంబర్ వన్‌గా ఉంది. ఆయన రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ వన్ చేశారు. అబద్ధాలు ఆడటంలో నంబర్‌వన్ చేశారు. మద్యం అమ్మకాల్లో నంబర్ వన్‌చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టడంలోనూ, ఫీజులు పెంచడంలోనూ నంబర్ వన్ చేశారు.
పెన్షన్ వయసు 45 ఏళ్లే..
అవ్వా తాతలకు పెన్షన్ రూ.2 వేలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తాం. కులాలు, మతాలకు అతీతంగా నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ముందుగానే ధరలు ప్రకటించి పంటలు కొనుగోలు చేస్తాం. శనగను రూ.8 వేలకు ప్రభుత్వం కొంటుందని పంట రావడానికి ముందే ప్రకటిస్తాం. ఇలా ప్రతి పంటకు ఏ రేటయితే గిట్టుబాటవుతుందో ముందే నిర్ణయించి ప్రకటిస్తాం. అందుకోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. ఖరీఫ్ రావడానికి ముందే రైతులకు వెసులుబాటు ఉండటం కోసం మే నెలలోనే రూ. 12,500 చొప్పున చెల్లిస్తాం. మన మేనిఫెస్టో చంద్రబాబులా కట్టలకొద్దీ ఉండదు.. మీరిచ్చే సలహాలతో రెండు, మూడు పేజీల్లో మేనిఫేస్టో తెస్తాం. అందులోని ప్రతి అక్షరాన్ని అమలు చేస్తాం. చెప్పినవే కాదు చెప్పనివీ అమలుచేస్తామని చెబుతున్నా. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేసామని చెబుతూ మరలా 2024లో మీ ముందుకు వస్తా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.