శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

YS Jagan Visits Tirumala Srivaru - Sakshi

సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిన తిరునామంతో.. శ్రీవారి ఆలయంలోకి  ప్రవేశించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి... వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా గర్భగుడిలోకి వెళ్లి.. తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వైఎస్‌ జగన్‌కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరారు.

ఆలయంలో శ్రీవారి సేవలో గడిపిన వైఎస్‌ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. జననేత ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు ముందు, పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా వైఎస్‌ జగన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో వైఎస్‌ఆర్‌ జిల్లా కడపకు బయలుదేరి వెళ్లారు. కడపలో పెద్ద దర్గాను వైఎస్‌ జగన్‌ దర్శించుకుంటారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.

మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో వైఎస్‌ జగన్‌  రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి తిరుమల కొండ మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయంలో  వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలికారు. వారి కోసం కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరీ.. వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అందించిన శాలువాలు, పుష్పగుచ్చాలను స్వీకరించారు. అంతకుముందు వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5.20కు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేసిన వైఎస్‌ జగన్‌.. ఉదయం గెస్ట్‌హౌస్‌ నుంచి ఆలయానికి వెళ్లారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top