అధికారంలోకి రాగానే రైతు కమిటీ వేస్తాం

YS Jagan Speech In Pithapuram Public Meeting - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే రైతు కమిటీ వేసి.. కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలను కల్పిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మీ కష్టాలు చూశా.. మీ బాధలు విన్నా
మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ఇదే నియోజకవర్గంలో నీరు చెట్టుకు కింద 27 చెరువుల్ని తవ్వేసి వందల కోట్లు దోచుకున్నారని చెప్పారు. అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పింఛన్లు తమ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పారు. ఏలూరు కాలువ ఆధునికీకరణ పనులు జరగలేదని రైతులు చెప్పారు. కాకినాడ సెజ్‌కు సంబంధించిన భూములను రైతులకు తిరిగి ఇస్తానని మోసం చేశారు. అధికారంలోకి వచ్చన తర్వాత చంద్రబాబు రైతులపై కేసులు పెట్టించారు. మీ అందరకి నేను ఒకటే చెబుతున్నా... ఎవరైనా కూడా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలని కోరుకుంటారు. ఉద్యోగాలు వస్తాయని ఆశపడతారు. కానీ రైతులను సంతోష పెట్టని పరిశ్రమలు వచ్చినా అది అభివృద్ధి కాదు. ప్రతి రైతన్నకు హామీ ఇస్తున్నా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రైతు కమిటీ వేస్తాం. రైతు ముఖాల్లో చిరునవ్వులు వచ్చేలా కమిటీ సిపారసు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. 

ప్రతి రైతన్నకు చెబుతున్నా నేను ఉన్నాను
14 నెలలు పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా. ప్రతి పేదవాడి కష్టాన్ని నేను చూశా. ఆ రోజు చూసిన కొని బాధలను ఇప్పటికి మర్చిపోలేను. అధికారం అనేది దేవుడు ఇచ్చిన వరం. అధికారం అనేది ఐదు కోట్ల మందిలో ఒకరి వస్తుంది. ఒక మషికి మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే పొరుగు వ్యక్తి బాగుపడతాడు. అదే ఒక ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే ఒక రాష్ట్రం బాగుపడుతుంది. పాదయాత్రలో అన్ని తెలుసుకున్నా. ఒక రైతు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు. పెట్టుబడి వ్యయం తగ్గిస్తుందా.. గిట్టుబాటు ధర కల్పిస్తుందా అని చూస్తాడు. ప్రతి రైతుకు చెబుతున్నా.. నేను ఉన్నాను.

2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఆరోజు లెక్కలు ప్రకారం లక్ష 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ నాటి నుంచి మన రాష్ట్ర యువత ఆ ఉద్యోగాల కోసం కోచింగ్‌లు తీసుకుంటూ డబ్బులు ఖర్చుపెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఖాళీలున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి నిరుద్యోగికి చెబుతున్నా..నేను ఉన్నాను.

అనారోగ్యంతో బాధపడుతున్నవారి బాధలు చూశా. అరోగ్య శ్రీ అమలు కాక ఆపరేషన్‌ చేయించుకోవాలంటే  ఆస్తులు అమ్ముకునే వాళ్లను చూశా. పక్షవాతం వచ్చి మంచానపడి.. ఆ కుర్చిని ఈడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి అన్నా మమ్ములను ఆదుకునే వారులేరు అని చెప్పిన మాటలు విన్నాను. అంబులెన్స్‌ రాక ప్రాణలు పోగొట్టుకున్న కుటుంబాలను చూశా. మీ అందరికి నేను ఉన్నాను. పెన్షన్‌ కోసం అవ్వాతాతలు పోతే ఏ పార్టీ అని అడిగి ఫించన్లు కట్‌ చేస్తున్నారు. ప్రతి అవ్వాతాతకు చెబుతున్న నేను ఉన్నా అని చెబున్నా.

ప్రతి కాపు సోదరుడికి చెబుతున్నా నేను ఉన్నాను
ఇదే నియోజకవర్గంలో కాపు సోదరులు నా దగ్గరకు వారి సమస్యలు చెప్పారు. చంద్రబాబు పాలనలో ఏ విధంగా మోసపోయారో చెప్పారు. రూ. 5వేల కోట్లు ఇస్తామని హమీ ఇచ్చిన మోసం చేశారు. ప్రతి కాపు సోదరుడికి చెబుతున్నా.. నేను ఉన్నాననే హామీ ఇస్తున్నాను.

హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి
ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. సొంతమామనే వెన్నపోటు పోడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజకీయాలలో విలువలు అనే పదానికి అర్థం లేకుండా పోయింది. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకు రావాలి. నిజాయితీ తీసుకు రావాలి. ప్రజలు ఇచ్చిన హామీలను నాయకుడు నెరవేర్చకుంటే సిగ్గుతో రాజీనామా చేసే వ్యవస్థను రూపొందించాలి.

డబ్బులకు మోసపోవద్దు
రాబోయే రోజుల్లో చంద్రబాబు మూటలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఓటుకు మూడు వేలు ఇస్తాడు. మీ అందరికి చెప్పేది ఒక్కటే గ్రామాల్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు.. అన్నను సీఎంను చేసుకుందామని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని వివరించండి. అన్న సీఎం అయితే మన బతుకులు బాగుపడ్తాయని వివరించండి.పిఠాపురం నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొరబాబును, ఎంపీ అభ్యర్థి గీతపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top