కొండంత అండగా నేనున్నాను: వైఎస్‌ జగన్‌

YS Jagan Speech In Koyyalgudem Public Meeting - Sakshi

పోలవరం నిర్వాసితులకు మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.5 లక్షలు

జనసంద్రంగా మారిన కొయ్యలగూడెం

వైఎస్‌ జగన్‌ ప్రచార సభతో కిక్కిరిసిన రోడ్లు

సీఎం జగన్‌ నినాదాలతో మార్మోగిన సభా ప్రాంగణం

సాక్షి, కొయ్యలగూడెం (పశ్చిమగోదావరి) :  ‘3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజల కష్టాలు, బాధలు చూశాను. వారి కన్నీటి గాథలు విన్నాను. సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న మీకు నేనున్నాను అని మాట ఇస్తున్నా.’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలను వివరిస్తూ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరిని అధికారంలోకి వచ్చాక ఆదుకుంటానన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

జన్మభూమి కమిటీలతో మాఫియా తీసుకొచ్చారు..
‘14 నెలలు.. సుమారు 3648 కిలోమీటర్లు.. దేవుడి ఆశీస్సులు.. మీ అందరి చల్లని దీవెనలతో నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో మీతో నడిచాను. మీ కష్టాలు విన్నాను. మీ బాధలను అర్థం చేసుకున్నాను. ఆ పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నాను. 13 జిల్లాలోను ఇదే పరిస్థితి. అధికారంలోకి చంద్రబాబు రాగానే రేషన్‌ కార్డులు తీసేశారు. అప్పటి వరకు ఉన్న పెన్షన్‌లు తీసేశారు. గ్రామాల్లోని ఎంపిటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లను పక్కనబెట్టి జన్మభూమి కమిటీల పేరుతో ఓ మాఫియా తీసుకొచ్చారు. ఈ మాఫియా చేసిందేమిటంటే.. గ్రామంలో మట్టి నుంచి ప్రతి ఒక్కటి దోచేశారు. ప్రతి పనికి లంచం తీసుకున్నారు. ఈ లంచాల గురించి ప్రజలు ప్రతిగ్రామంలో చెప్పుకొచ్చారు. బాత్‌రూం నిర్మాణం కావాలన్నా లంచం.. ప్రమాదబీమాకు లంచం.. డెత్‌, బర్త్‌ సర్టిఫికేట్‌కు లంచం, పెన్షన్‌కు లంచం. రేషన్‌ కార్డుకు లంచం. ప్రతి గ్రామంలో ఏ పని కావాలన్నా..లంచం. ఈ లంచాలతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో విన్నాను. స్వయంగా చూశాను.. వారందరికి సంక్షేమ పథకాలు అందించడానికి నేనున్నాను అని మాట ఇస్తున్నాను.

అక్కచెల్లెమ్మల కష్టాలు విన్నాను. పొదుపు సంఘాల్లో ఉండి వారు పడిన బాధలను చూశాను. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండానే.. చేసేసినట్లు శాలువా కప్పుకున్నారని వారు చెప్పిన మాటలను విన్నాను. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చిన రూ.10 వేల గురించి, సున్నా వడ్డీకి ఇవ్వాల్సిన బకాయిలను ఎగ్గొట్టిన విషయాన్ని చెప్పారు. ఏ రకంగా బ్యాంకు వారు వచ్చి తాళాలు వేస్తున్నారో చెప్పుకొచ్చారు. గతంలో ఏ విధంగా సున్నా వడ్డీలకు ఎలా రుణాలు వచ్చాయో కూడా నాకు వివరించారు. దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే ప్రతి డ్వాక్రా మహిళకు ప్రతి అక్కకు నేనున్నానని.. అండగా ఉంటానని చెబుతున్నాను. అందరిని ఆదుకుంటానని భరోసా ఇస్తున్నాను.

గిట్టుబాటు ధర కల్పిస్తాం..
రైతులు పడిన ఆవేదన చూశాను. ఆ రైతన్నకు కొండంత అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్న ఆ రైతన్నలకు అధికారంలోకి రాగానే మే మాసంలో రూ.12,500 చేతుల్లో పెడ్తామని హామీ ఇస్తున్నాను. రైతుల కోసం రుణాలిప్పిస్తాం.. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీలు, టోల్‌ ట్యాక్సీలు లేకుండా చేస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంట్‌ ఇస్తాం. గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరికరణ తీసుకొస్తాం. ఈ జిల్లాలో తిరుగుతున్నప్పుడు రైతన్నలు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు నాకు గుర్తుకు ఉన్నాయి. పొగాకు ధరలు గురించి జగన్‌ వచ్చి ధర్నా చేసినా పెరగని పరిస్థితిని చూశాం. పంట చేతికి వచ్చే సరికి మద్దతు ధర ఉండదు. ఇలాంటి పరిస్థితులు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం. దానికి గ్యారెంటీ కూడా ఇస్తాం. రైతన్న ఆకస్మిక మరణంతో ఆ కటుంబ సభ్యులు పడిన బాధలు విన్నా. ఏ రైతన్నా ప్రమాదవశాత్తు చనిపోయినా.. ఆత్మహత్య చేసుకున్నా.. రూ.7 లక్షల డబ్బుతో ఆర్థిక సాయం చేస్తాం. దీనికి అనుగుణంగా చట్టం తీసుకొస్తాం. ప్రతి రైతన్నకు నేను ఉన్నాను.. వారి ఆవేదనను నేను విన్నాను.. వారి సమస్యలను స్వయంగా చూశాను.. అందుకే వారందరికీ నేనున్నాననే భరోసా ఇస్తున్నాను.

మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.5 లక్షలు ..
పోలవరం ప్రాజెక్ట్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తాం. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద సాయం రూ.10 లక్షలకు పెంచుతా. కమిషన్‌ కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నుంచి చంద్రబాబు తీసుకున్నారు. నామినేషన్‌ పద్ధతిలో పనులు చేయిస్తున్నారు. టీడీపీ నేతలే సబ్‌ కాట్రాంక్టర్లు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. పునాదులు దాటి పనులు ముందుకు సాగడం లేదు. తన ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్నారని చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై రోజుకో కథ రోజుకో సినిమా చూపిస్తున్నారు. రాష్ట్రంలో దారుణంగా బాబు పాలన సాగిస్తున్నారు. 

అన్న మన బతుకులు బాగు చేస్తాడని చెప్పండి 
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు చేయని జిమ్మిక్కులు ఉండవు. గ్రామాల్లోకి డబ్బులు మూటలు పంపిస్తారు.  అందుకే ప్రతి ఊరికి వెళ్లండి. ప్రతి ఒక్కరికీ చెప్పండి. చంద్రబాబుకు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి.
- చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశ పడకండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లలను బడికి పంపిస్తే, ప్రతి కుటుంబానికి ఏటా రూ.15,000 ఇస్తాడని చెప్పండి.  
- విద్యార్థులు ఎక్కడ, ఏ కోర్సు చదివినా పూర్తి ఫీజు చెల్లిస్తాడని ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి. ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ.. ఏ కోర్సు అయినా సరే, ఎంత ఫీజు అయినా సరే అన్న చదివిస్తాడని చెప్పండి. - అన్నను సీఎం చేసుకుందాం, పెట్టుబడి సాయం కింద నాలుగేళ్లలో రూ.50,000 ఇస్తాడని రైతన్నలకు చెప్పండి. ప్రతి ఏటా మేలో రూ.12,500 రైతుల చేతిలో పెడతాడని చెప్పండి. ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పండి.  
- ‘వైఎస్సార్‌ చేయూత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పండి. ఈ కార్యక్రమం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చేతిలో రూ.75,000 పెడతాడని చెప్పండి.  
- అన్నను సీఎంను చేసుకుంటే, ఎన్నికల నాటికి ఉన్న అప్పును నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే ఇస్తాడని పొదుపు సంఘాల మహిళలకు చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు అందుతాయని, మీరు లక్షాధికారులు అవుతారని చెప్పండి.  
- అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఒక మాట అడగండి. మీకు మూడు నెలల క్రితం దాకా ఎంత పెన్షన్‌ వచ్చేదని అడగండి. తమకు పెన్షన్‌ రావడం లేదని కొందరు చెబుతారు. ఇంకొందరు రూ.2,000 వస్తున్నాయని చెబుతారు. మరి జగనన్న లేకపోతే ఆ పెన్షన్‌ వచ్చేదా? అని అడగండి. జగన్‌ అన్నకు భయపడే చంద్రబాబు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే పెన్షన్‌ పెంచాడని చెప్పండి.  
- జగనన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్‌ రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి. 
-పోలవరం నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెల్లం బాలరాజు, ఏలూరు ఎంపీ అభ్యర్థి  కోటగిరి శ్రీధర్‌కు  మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top