ఊసరవెల్లికి కూడా చంద్రబాబు అంటే భయం.. | YS Jagan slams cm chandrababu naidu in kanigiri public meeting | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లికి కూడా చంద్రబాబు అంటే భయం..

Feb 24 2018 5:34 PM | Updated on Jul 25 2018 5:32 PM

YS Jagan slams cm chandrababu naidu in kanigiri public meeting - Sakshi

సాక్షి, కనిగిరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా జరగని అవినీతి బాబు హయాంలో జరుగుతోందని, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి ఊరిలో మంచి నీరు దొరకుతుందో లేదో తెలీదు కానీ, మద్యం మాత్రం దొరకుతుందని, ఫోన్‌ చేస్తే ఇంటికి వచ్చి డెలివరీ చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

నాలుగేళ్లుగా పెట్రోలు, డీజిల్‌ మీద బాదుడు కనిపిస్తోందని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రూ.7 ఎక్కువగా ఉందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ‘అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చంద్రబాబు మూడుసార్లు కరెంట్‌ చార్జీలు పెంచారు. విద్యుత్‌ బిల్లులకు భయపడి ఇంట్లో టీవీ కూడా ఆన్‌ చేయలేని పరిస్థితి వచ్చింది. బాబు అధికారంలోకి రాకముందు రూ100 వచ్చే కరెంట్‌ బిల్లు ఇప్పుడు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వస్తోంది. అంతే కాదు రూ.10వేల పెనాల్టీ అంటూ ప్రజలను హింసిస్తున్నారు. పక్కనున్న ఊర్లో బంధువుల ఇంటికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. పండుగ వస్తే టికెట్లు కొత్త సినిమాకు బ్లా​క్‌లో అమ్మినట్లు అమ్మతున్నారు.

నాన్నగారి హయాంలో రేషన్‌ దుకాణానికి వెళ్తే అన్ని సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. వాటిలో కూడా వేళ్లు పడట్లేదంటూ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు. పండించిన పంటకు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. పొగాకు, కందులు, శనగకు కనీసం గిట్టుబాటు ధర లభించడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జామాయిల్‌ రైతులకు క్వింటా రూ.4200 ఉంటే ఇప్పుడు రూ. 1800 కూడా రావడం లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు.

కానీ ఏ ఒక్కరికి పూర్తిగా రుణమాఫీ జరిగని పరిస్థితి. తాకట్లు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు  నోటీస్‌ పంపిస్తున్నాయి. ఇంట్లో ఆడబిడ్డ కన్నీరు పెడితే అది అరిష్టం అంటారు. కానీ చంద్రబాబు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు ప్రతిరోజు కన్నీరు పెడుతున్నారు. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీకిందకు కూడా సరిపోలేదు. ఇక అధికారంలోకి రావడానికి యువతను సైతం మోసం చేశాడు. జాబు రావాలంటే బాబు రావాంటూ మభ్యపెట్టాడు. ఇప్పటి వరకూ ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి చెల్లించలేదు. ప్రతి నిరుద్యోగికి రూ 90 వేలు బాకీ ఉన్నారు. ఎన్నికల సమయంలో పూర్తి రుణమాఫీ చేస్తానన్నారు, నాలుగేళ్లులో ఏ ఒక్కరికి సంపూర్ణ రుణమాఫీ అవలేదు. 

ప్రకాశం జిల్లాలో 787 ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలు ఉన్నాయి. డయాలసిస్‌ సెంటర్లలో డాక్టర్లు లేని పరిస్థితి ఉంది. ప్రైవేటుగా చేయించుకోవాలంటే వేలాది రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్లోరోసిస్‌ నుంచి విముక్తి కలిగించడానికి రామతీర్ధం నుంచి కనిగిరికి నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దే. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును  పూర్తి చేస్తాం.  ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు ప్రవేశ పెట్టాం. పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఎన్ని లక్షలైనా భరిస్తాం. హాస్టల్‌ చార్జీల కింద రూ.20 వేలు ఇస్తాం. చిన్నారులను బడులకు పంపే తల్లి దండ్రలకు రూ.15వేలు ఇస్తాం. అంతేకాకుండా అవ్వా,తాతలకు పింఛన్లును రూ.2వేలకు పెంచుతాం. వయోపరిమితి 60 ఏళ్లకే తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్‌ ఇస్తున్నానని భరోసా ఇస్తున్నా.’ అని అన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement