బీసీల్లో ఆర్థిక విప్లవం

YS Jagan Promises 75 Thousand Crore Rupees To BC Welfare - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీల అభ్యున్నతికి రూ. 75,000 కోట్లు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీపై సర్వత్రా హర్షం

బీసీల సంక్షేమానికి ఏటా రూ.15,000 కోట్లు వ్యయం

నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌

వెనుకబడిన తరగతులకు 139 కార్పొరేషన్లు 

కార్పొరేషన్ల ద్వారా 45ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు రూ.75 వేలు అందజేత

 మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పది వేలు

పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి రూ.10 లక్షలు

మాట తప్పని జగన్‌ వస్తే బీసీల్లో ఆర్థిక విప్లవం

ఇన్నాళ్లూ కేవలం చంద్రబాబు ప్రచారార్భాటానికి మాత్రమే ఉపయోగపడిన బీసీల బతుకులు వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, హామీలతో కొంగొత్తగా చిగురించనున్నాయి. బీసీల్లో ప్రతీ కులం వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం సాధ్యమేనని బీసీ డిక్లరేషన్‌ స్పష్టీకరిస్తోంది. వివిధ కుల వృత్తులకు జీవం పోసేలా తీసుకోనున్న నిర్ణయాలు వారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయా సామాజిక వర్గాల పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. 

బీసీలంటే.. ప్రస్తుత పాలకులకు అలుసు. వెనుకబడిన తరగతులను.. తరతరాలుగా ఓటుబ్యాంకుగా మాత్రమే పరిగణిస్తూ..కూరలో కరివేపాకు చందంగా వ్యవహరించారు. బీసీలను సామాజికంగా,ఆర్థికంగా అణగతొక్కారు. రాజకీయంగా ఎదగనీయలేదు. ఇలాంటి పరిస్థితిల్లో తన 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో.. దారిపొడవునా బీసీల సమస్యలను నేరుగా చూసిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఫిబ్రవరి17న ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. ‘బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. భారతదేశ కల్చర్‌’ అని అభివర్ణించిన ఆయన.. బీసీల అభివృద్ధికి ప్రతిఏటా రూ.15వేల కోట్ల చొప్పున..ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి సంచలనం సృష్టించారు. మాట తప్పని జగన్‌ అధికారంలోకి వస్తే.. తమ ఆశలు నెరవేరుతాయని బీసీలు అభిప్రాయపడుతున్నారు. బీసీల్లో ఆర్థిక విప్లవం జగన్‌తోనే సాధ్యం అంటున్నారు!!

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. వెనుకబడిన తరగతుల్లో ఆర్థిక విప్లవం తీసుకొస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ‘బీసీ డిక్లరేషన్‌’ ప్రకటించారు. ‘బీసీలంటే.. బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. భారతదేశ కల్చర్‌’గా వర్ణిస్తూ.. వెనుకబడిన తరగతుల పట్ల తన గౌరవభావాన్ని చాటుకున్నారు. నిరాదరణకు గురైన వెనుకబడిన తరగతులందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. ఆచరణ సాధ్యమైన హామీలను బీసీ డిక్లరేషన్‌లో వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. బీసీల వృత్తులకు మరింత ఆర్ధిక ఊతం ఇవ్వడంతోపాటు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్ధుల ఉన్నత చదువులకు కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంతపెద్ద చదువులైనా ఉచితంగా చదివిస్తానని జగన్‌ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలపై ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

139 కార్పొరేషన్లతో నూతన శకం
ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ప్రతీ గ్రామంలో అర్హులందరికీ మేలు జరిగేలా అన్ని కులాలకు  కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వెనుకబడిన తరగతుల కోసం ఆయా వర్గాల పేరు మీద 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా సంబంధిత వర్గాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. బడ్జెట్‌లో మూడొంతుల నిధులను వెనుకబడిన తరగతుల కోసమే వ్యయం చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆయా కులాల్లోని 45 ఏళ్ల  నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతీ అక్కాచెల్లెమ్మలకు నాలుగు విడతల్లో ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75వేలు ఇస్తారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ వలంటీర్‌ ద్వారా నేరుగా ఇంటికి తీసువెళ్లి అక్కా చెల్లెమ్మల చేతుల్లో రూ.75వేలు పెడతారు.

అన్నిటిలో సగం..
బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే ఇస్తామని.. అందుకు చట్టం తీసుకువస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. బలహీన వర్గాలకు ఆర్థికంగా సంపాదించుకునే అవకాశాలను కల్పించాలనే దూరదృష్టితో ఆలోచించిన జగన్‌.. ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వంలో చిన్న చిన్న పనులతోపాటు ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం పనులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. బీసీలను రాజకీయంగా ఎదిగేలా చేసేందుకు..  ప్రభుత్వ సంస్థలు, వివిధ సంస్థలు, మార్కెట్‌ కమిటీలు, గుడులు, ట్రస్ట్‌ తదితర బోర్డుల్లో నామినేటెడ్‌ పదవుల్లో కూడా 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే దక్కనున్నాయి. ఇందుకు చట్టబద్దత కూడా కల్పిస్తారు.

బీసీ కమిషన్‌ ద్వారా శాస్త్రీయ అధ్యయనం 
వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలు సామాజిక మార్పు కోరుతున్నాయి. ఈ సామాజిక మార్పుపై ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం, హేతుబద్ధత లేకుండా.. రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. సగర, కృష్ణ బలిజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీ–ఎగా గుర్తించమని కోరుతున్నారు. మేదర, వాల్మీకి, కురబ, వడ్డెర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రజక, గాండ్ల, మేదరులు, అరెకటికల ఎస్సీలుగా గుర్తించమని అడుగుతున్నారు. వీరందరి ఆకాంక్షల కోసం బీసీ కమిషన్‌కు అప్పగిస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. బీసీ కమిషన్‌ పరిధిలోకి రాని ఎస్సీ, ఎస్టీల అంశాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాత కేంద్రానికి పంపిస్తామన్నారు. బీసీలకు సంబంధించిన ఏ అంశమైనా పరిష్కారానికి బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తామన్నారు.

క్షురకుల సంక్షేమ గురించి ఆలోచించిన నేత జగనన్న 
బార్బర్‌ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. క్షురకుల సంక్షేమం గురించి ఆలోచించిన నేత జగనన్న ఒక్కరే. ఏటా ప్రతి బార్బర్‌ షాపుకు పదివేలు కేటాయింపు, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం, ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని హామీనిచ్చారు. ఆ హామీతో మా బతుకుల్లో ఆశలు చిగురించింది. బార్బర్‌ షాపులున్న వారికి ఏటా పదివేలు ఇస్తాననడంతో ఎంతో ఆసరా లభించింది.

గొర్రెలు, మేకలు మృతి చెందితే రూ.6 వేలు 
గొర్రెలు, మేకలు మృతి చెందితే రూ.6000 పరిహారం చెల్లిస్తారు. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు ఆ సన్నిధి గొల్లలకే ఇస్తారు. వారికి వంశ పారంపర్య హక్కు కల్పిస్తారు. ప్రధాన ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చేలా చేస్తారు. బోర్డు సభ్యుల్లో నాయీ బ్రాహ్మణులకు, యాదవులకు చోటు కల్పిస్తారు. ఇంట్లో మగ్గం ఉండి.. చేనేతతోనే జీవితం గడుపుతున్న ప్రతీ అక్కా, చెల్లెమ్మకు పెట్టుబడి రాయితీ కింద నెల నెలా రూ.2000 సాయం అందిస్తారు. యాదవ సోదరులతోపాటు ఎవరు సహకార డెయిరీలకు పాలు పోసినా.. లీటర్‌కు రూ.4కు సబ్సిడీ ఇస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు,  రైతులతోసహా ఎవరైనా పొరపాటున మరణిస్తే..  వైఎస్సార్‌ బీమా కింద రూ.ఏడు లక్షలు ఆడపడుచులకు సాయంగా ఇస్తారు. ఆ డబ్బు అప్పుల వారికి చెందకుండా చట్టం తీసుకువస్తారు. 

చిరు వ్యాపారులకు చేయూత
రహదారుల పక్కన చిరువ్యాపారం చేసుకుంటూ.. జీవిస్తున్న వారి బాధలను పాదయాత్రలో స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌ వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చిరు వ్యాపారులను గుర్తించి, వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు. వారందరికీ అవసరమైనప్పుడల్లా సున్నా వడ్డీకి రూ. 10,000 అందిస్తారు. షాపున్న ప్రతి నాయీబ్రహ్మణునికి ప్రతి షాపునకు ఏడాది 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. సంచార జాతులు ఒకేచోట ఉంటానంటే.. వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తారు. వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10,000 ఇస్తారు.  పొరపాటున మత్స్యకారులకు ఏదైనా జరిగి ప్రాణాలు కోల్పోతే.. రూ.పది లక్షలు పరిహారం ఇస్తారు. 

బీసీలకు ఇచ్చిన హామీలు మరిచిన చంద్రబాబు
2014 ఎన్నికలప్పుడు విద్య,ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు 33 1/3 శాతానికి పెంచుతామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా దాన్ని పట్టించుకోలేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అదనపు సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆ మాటే మరిచారు. చేనేత కార్మికుల కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధితోపాటు చేనేత కార్మికులకు ప్రతీ ఏడాది బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. వెనుకబడిన కులాలకు యూనివర్శిటీల వైస్‌ చాన్సలర్లు, పాలక మండళ్లలో 33 1/3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలప్పుడు చెప్పి అమలు చేయలేదు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పూర్తి ఇవ్వకుండా కేవలం రూ.35 వేలు ఇస్తున్నారు. బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత నాలుగున్నరేళ్లు కల్పించని చంద్రబాబు... ఎన్నికల ముందు చివరి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్దత అంటూ ఉత్తుత్తి బిల్లును ఆమోదించారు. ఆ బిల్లులో ఎంత శాతం నిధులు కేటాయిస్తారో చెప్పలేదన్న విషయాన్ని అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యులే ప్రశ్నించారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అయిపోతోంది. 

జీవోలతో హడావుడి.. నిధులు సున్నా
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌తో ఉలిక్కిపడిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత బీసీ డిక్లరేషన్‌లోని అంశాలన్నింటినీ తానే అమలు చేస్తానంటూ ప్రకటించారు. వెనుకబడిన కులాలన్నింటికీ కార్పొరేషన్లంటూ.. ఎన్నికల ముందు జీవోలు ఇచ్చారు.  కాని ఆ కార్పొరేషన్లకు పైసా నిధులు విడుదల చేయలేదు. ప్రతిపక్ష నేత ప్రకటించినందున తాను కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేశానంటూ ప్రచారం కోసం జీవోలు ఇచ్చారు తప్ప బీసీ వర్గాల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ లేదనే విషయం ఇక్కడే తేటతెల్లమైపోయిందని బీసీ వర్గాలుæ అభిప్రాయపడుతున్నాయి. బీసీ వర్గాల కార్పొరేషన్‌ పరిస్థితి ఇలా ఉంటే.. గతంలో ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్, బ్రాణ్మణ కార్పొరేషన్‌లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. దీంతో బ్యాంకుల నుంచి రుణాల మంజూరు నిలిచిపోయింది!!

రూ.10 వేలు చిరు వ్యాపారులకు వరం  
వైఎస్సార్‌ సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యం. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ బాగుంది. తోపుడు బళ్లపై పండ్లు అమ్ముకుని జీవనోపాధి పొందే చిరు వ్యాపారులకు ఏటా పెట్టుబడి సాయంగా ప్రోత్సాహం అందించేందుకు రూ.10 వేలు ఇస్తాననడం అభినందనీయం. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. 
– వానశెట్టి తాతాజీ, తోపుడు బళ్లపై పండ్లు అమ్ముకునే వర్తకుడు, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా  

బీసీలకు నామినేటెడ్‌ పదవుల్లో50 శాతం రిజర్వేషన్లు అభినందనీయం  
బీసీలకు మేలు చేసేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ ఉంది. వెనుకబడిన తరగతులకు చెందిన వారికి నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం. జగన్‌కు మద్దతుగా నిలుస్తాం.  
– పెంటిమేను చిన్ని, బీసీ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం డివిజన్‌ ఉపాధ్యక్షుడు, గుమ్మళ్ళదొడ్డి , గోకవరం, తూర్పుగోదావరి జిల్లా 

బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తాననడం మంచి పరిణామం 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే బీసీ కమీషన్‌ ఏర్పాటు చేస్తానని చెప్పడం మంచి పరిణామం. ఐదేళ్లలో 75వేల కోట్లు బీసీల ఖర్చుచేస్తానని ప్రకటించారు. బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు చిరువ్యాపారులకువడ్డీ లేకుండా పదివేల ఆర్థిక సహాయం చేస్తాననడం ఆనందంగా ఉంది. – గోపసాని పెంచలయ్య, నాగమాంబాపురం, నెల్లూరు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top