‘పశ్చిమ’లోకి ప్రజాసంకల్పయాత్ర.. | Sakshi
Sakshi News home page

Published Sun, May 13 2018 3:24 PM

YS Jagan Padayatra enters in West Godavari District - Sakshi

సాక్షి, ఏలూరు : రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి కలకుర్రు మీద నుంచి మహేశ్వరపురం వరకు పాదయాత్ర కొనసాగింది. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దాటనున్నారు. రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఏలూరు మండలం వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించనున్నారు. సోమవారం సాయంత్రం ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జననేత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 250 కి.మీ మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు.  

అడుగడుగునా జన నీరాజనాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. జిల్లాలో అడుగుపెట్టిన జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తరలివచ్చి.. వైఎస్‌ జగన్‌ అడుగులో అడుగు వేసి కదిలారు. భారీగా పార్టీ నేతలు, శ్రేణులు, జనం తరలిరావడంతో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశించనుందని పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. అయినా, ట్రాఫిక్‌ నియంత్రణలో, తగిన ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందడంతో వారి తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగి ఉన్న వాహనాల మధ్య నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు.

కృష్ణాజిల్లాలో పాదయాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఏప్రిల్ 14న వైఎస్ జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దుర్గమ్మ వారధి మీద జన సునామీ వచ్చిందా అన్నట్లు జనం వైఎస్‌ జగన్‌ అడుగులో అడుగేశారు. విజయవాడ టౌన్‌లోని మూడు నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది.  కృష్ణా జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో జననేత అడుగులు వేశారు. 18 మండలాలు, 130 గ్రామాలు,  5 మునిసిపాలిటీలుగా మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగింది. కృష్ణా జిల్లాలో 12 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన జగన్.. 10 బహిరంగ సభలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మొత్తం  239 కిలో మీటర్లు ఆయన నడిచారు. న్యాయవాదులు, నాయిబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కలంకారీ చేతివృత్తిదారులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు.

ఎస్సీల ఆత్మీయ  సమ్మేళనంలో పాల్గొన్నారు.  జగన్‌ కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉండగా.. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి,  మైలవరం నియోజకవర్గానికి చెందిన వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్,  విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరారు.  ఏప్రిల్ 16న ప్రత్యేక హోదా కోసం జరిగిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా  పాదయాత్రకు వైఎస్‌ జగన్‌ విరామమిచ్చారు.  ఏప్రిల్ 30న హోదాపై టీడీపీ మోసాన్ని ఎండగడుతూ.. వంచన వ్యతిరేక దినానికి సంఘీభావంగా నల్లరిబ్బన్లు కట్టుకుని ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు.  

Advertisement
Advertisement