వైఎస్‌ జగన్‌ ఉద్యమ శంఖారావం

YS Jagan movement call for Ap special status - Sakshi

ప్యాకేజీతో మోసపోవద్దు ప్రత్యేక హోదా మన హక్కు

మార్చి 5 నుంచి పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఆందోళన

కేంద్రం దిగిరాకుంటే.. ఏప్రిల్‌ 6న ఎంపీల రాజీనామా

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్‌ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంకల్ప పాదయాత్ర 85వ రోజున ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ ఈ సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కోసం అనేక రూపాలలో ఉద్యమాలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మార్చి 1 నుంచి మరిన్ని పోరాటాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఏప్రిల్‌ 6 వరకు తమ ఎంపీలు పోరాటం కొనసాగిస్తారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోతే రాజీనామా చేస్తారని జగన్‌ ప్రకటించారు. ‘ప్రత్యేక హోదా అనేది మన ఊపిరి. దాని కోసం మనం చేసే పోరాటం ఇంతటితో ఆగదు. మన ఊపిరి ఉన్నంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటామని మరో సారి స్పష్టం చేస్తున్నాను.’ అని జగన్‌ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 6న రాజీనామాల వరకు...
‘‘మార్చి 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన ప్రతి కార్యకర్త, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆందోళన చేస్తారు. కలెక్టరేట్‌లను ముట్టడిస్తారు. మార్చి 3న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నేతలంతా కూడా నేను పాదయాత్ర చేస్తున్న చోటుకు వస్తారు. అక్కడ నుంచి నేను జెండా ఊపి వారందరినీ ఢిల్లీలో మార్చి 5వ తేదీన ధర్నా చేయడానికి పంపిస్తాను. ‘ప్రత్యేక హోదా మా హక్కు–ప్యాకేజీ మాకొద్దు’ అనే నినాదంతో వారంతా ఢిల్లీ చేరుకుని ధర్నా చేస్తారు. మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం మన పార్టీ ఎంపీలు పోరాటాన్ని కొనసాగిస్తారు. ఏప్రిల్‌ 6వ తేదీ వరకూ నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మన ఎంపీలు అక్కడే ఉండి ఆ నెల రోజులూ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పోరాటం చేస్తారు.  సమావేశాల చివరి రోజు వరకూ పోరాటం చేసినా కూడా ప్రత్యేక హోదా రాక పోతే ఏప్రిల్‌ ఆరవ తేదీన మన లోక్‌సభ సభ్యులు నిరసనలు తెలుపుతూ తమ రాజీనామా లేఖలను వారి మొహాన పడేసి మన రాష్ట్రానికి వస్తారు. మనకు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను సమాధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానీయకూడదనే ఉద్దేశ్యంతోనే ... ప్రత్యేక హోదా మా హక్కు – ప్యాకేజీతో మోసం చేయొద్దు చంద్రబాబూ... అని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాను.  

హోదా మా హక్కు.. ప్యాకేజీతో మోసం చెయ్యొద్దు: హోదా గురించి చంద్రబాబు అడక్కుండా దానిని శాశ్వతంగా సమాధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనీయకూడదనే ఉద్దేశ్యంతో... ‘ప్రత్యేక హోదా మా హక్కు... ప్యాకేజీతో మోసం చేయొద్దు చంద్రబాబు గారూ’ అని ఇక్కడి నుంచే పిలుపు నిస్తున్నాను.’’ అని జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

12 రోజులుగా చంద్రబాబు డ్రామాలు...
గత 12 రోజులుగా చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌పై టీవీల్లో డ్రామాలాడుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టగానే ఆయన ఈ డ్రామా మొదలు పెట్టారు. ఆశ్చర్యమేమిటంటే చంద్రబాబుకు చెందిన ఎంపీలే కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వారు క్యాబినెట్‌లో ఆమోదించాకే బడ్జెట్‌ను పార్లమెంటులో పెడతారు. గత ఐదు బడ్జెట్‌లలో కూడా ఇదే విధంగా వారు ఆమోదం తెలిపారు. కేంద్రంలో ఉన్న తన మంత్రులు ఆమోదించారని తెలిసి కూడా బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. జనవరి 27, 2017న అప్పటి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి ముందు చంద్రబాబు ఏమన్నారంటే... మనమే ఎక్కువ సాధించాం. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ వచ్చాయా? ఆధారాలుంటే రండి.. చెప్పండి అని సవాలు విసిరారు. ఓ ఏడాది కిందట కేంద్రం నిధులు దండిగా ఇచ్చిందని చెబుతూ ప్రత్యేక హోదా అనే మనహక్కును చంద్రబాబు తన ప్యాకేజీల కోసం అమ్మేశారు.  

మనం ఉద్యోగాల కోసం అలమటిస్తున్నామని, అలాంటి పరిస్థితి పోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకహోదాను ఇస్తామని చెప్పి ఆనాడు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎన్నికలపుడు ప్రత్యేక హోదా అంటే సంజీవని అని, దాని వల్ల ఉద్యోగాలొస్తాయని చెప్పారు.  ఆ తరువాత జూన్‌ 6, 2017 వచ్చేటప్పటికి ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలేంటి అంటూ ప్లేటు ఫిరాయించారు. తెస్తామన్న వారే చెప్పాలని కూడా అన్నారు. తాను దేశంలోకెల్లా సీనియర్‌ నేతను అని బాబు చెప్పుకున్నారు. ఆయన ఎంత గొప్ప సీనియర్‌ నేత అంటే హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదాను మోసపూరిత ప్యాకేజీకి అమ్ముకున్న వ్యక్తి ఆయన. అదే ఆయన సీనియారిటీ. హోదా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని  కేంద్ర మంత్రి సుజనా చౌదరి 12.09.2016న అన్నారు. ఒక పద్ధతి ప్రకారం మన హక్కు అయిన హోదాకు తూట్లు పొడిచారు. ఇవాళ బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చంద్రబాబు యాగీ చేస్తున్నారు గానీ, ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడం లేదు. ఇలా హోదాను అమ్మేయడం అన్యాయం కాదా అని అడుగుతున్నాను.  ఇవాళ చంద్రబాబు అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రత్యేక హోదా గురించి అడగడం లేదు కానీ, తమకు రూపాయి ఇవ్వాల్సింది అర్ధరూపాయే... ముప్పావలాయే ఇచ్చారని అడుగుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top