మన ఇంజనీర్లకు ఏం తక్కువ?  | Sakshi
Sakshi News home page

మన ఇంజనీర్లకు ఏం తక్కువ? 

Published Sun, Sep 16 2018 4:30 AM

YS Jagan Mohan Reddy Comments about AP Engineers - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎంతో మంది మేధావులైన ఇంజినీర్లు ఉండగా, సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పనులను సింగపూర్, జపాన్, ఇతర దేశాల కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనలో లేనిది ఏమిటి? వాళ్లలో ఉన్నదేమిటని ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థి అడుగుతున్నాడని, దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 262వ రోజు శనివారం ఆయన మార్గం మధ్యలో విశాఖ శివార్లలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ‘ఇంజినీర్స్‌ డే’ సందర్భంగా ఇంజినీరింగ్‌ వృత్తి నిపుణులు, విద్యావంతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘మన రాష్ట్రంలో పిల్లలకేమో ఉద్యోగాలు దొరుకడం లేదు. ముఖ్యమంత్రి మాత్రం మన రాష్ట్రంలో ప్రాజెక్టులను సింగపూర్, జపాన్, ఇతర దేశాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మనలో లేనిదేమిటి? వాళ్లల్లో (విదేశీ సంస్థల్లో) ఉన్నదేమిటి? అని మన రాష్ట్రంలోని ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థి అడుగుతున్న సముచితమైన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం చెప్పి తీరాలి. చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా సింగపూర్, జపాన్‌లాంటి దేశాలను నమ్ముకున్నాడు. వాళ్లందరినీ నమ్ముకుని ఇంత వరకు కనీసం రాజధాని ప్రాంతంలో శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేని అన్యాయమైన పరిస్థితుల్లోకి నెట్టారు. ఈ వ్యవహారంలో ఆయన ప్రభుత్వం పని చేస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 

కర్ణాటకను చూసి బుద్ధి తెచ్చుకోవాలి.. 
మన పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో విధాన సౌధ, హైకోర్టు భవనాలు చాలా చక్కగా కనిపిస్తాయి. వాటిని మన ఇంజినీర్లే (అక్కడి వారే) కట్టారు. ఆ భవనాలను అంత చక్కగా మన ఇంజినీర్లే కట్టారన్న బుద్ధీ, జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం విచారకరం. ఆ రోజుల్లో అవి కట్టింది ఎనిమిదేళ్లు కూడా కాదు.. విధాన సౌధ అయితే మూడేళ్లలోనే కట్టారు. అలాంటిది ఇక్కడ నాలుగున్నర సంవత్సరాలు అయినా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇంత వరకు చంద్రబాబునాయుడు డిజైన్లు.. డిజైన్లు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆ విదేశీ కన్సల్టెంట్లు కనీసం ఒక్క డిజైన్‌ను కూడా ఇవ్వలేదు.. ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మన టాలెంట్‌ను (ప్రతిభను) పట్టించుకోకుండా, గుర్తించకుండా పక్క దేశాల్లో ఉన్న వారికి అనవసరంగా చంద్రబాబు నాయుడు ఎక్కువ గుర్తింపు ఇచ్చారు. చివరకు.. ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి ఓ పెద్ద గుండు సున్నా..’ అని జగన్‌ అన్నారు. తనపై ఇంజినీర్లు చూపిస్తున్న ఆప్యాయతకు, ఈ సంఘీభావానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తనతో కలిసి నడవడానికి వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రెక్టార్‌ ప్రసాద్‌ రెడ్డి, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ బీఎస్సార్‌ నాయుడు, పెద్ద సంఖ్యలో ఇంజినీర్లు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.  

అడుగడుగునా ఘన స్వాగతం 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిన మార్గంలో అడుగడుగునా ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. నగర పరిసరాల్లోని ఆరిలోవ జంక్షన్‌ వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర రామకృష్ణపురం, శ్రీకృష్ణపురం, ఫైనాపిల్‌ కాలని, ధారపాలెం, అడవివరం క్రాస్, లండగరువు మీదుగా దువ్వపాలెం వరకూ సాగింది. జగన్‌ను దగ్గరి నుంచి చూడటానికి, కరచాలనం చేయడానికి జనం పోటీపడ్డారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులో జగన్,, ఇంజినీర్స్‌ డే కార్యక్రమంలో పాల్గొనడం ఇంజినీరింగ్‌ వృత్తి నిపుణులు, విద్యావేత్తలకు ఆనందాన్ని కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు  కేవలం ప్రచారార్భాటంతో పాలన సాగిస్తున్నారు తప్ప ఐటీ రంగానికి ఏపీలో చేసిందేమీ లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ఇంజినీర్లు ‘వాక్‌ విత్‌ జగన్‌’ పేరుతో ఆయనతో కలిసి పాదయాత్రలో అడుగులో అడుగు వేశారు. జై జగన్‌.. అంటూ నినాదాలు చేశారు. మరోవైపు వినతులూ వెల్లువెత్తాయి. దివ్యాంగుడైన ఓ పరిశోధక విద్యార్థి జగన్‌ను కలిసి 2016 చట్టాన్ని గట్టిగా అమలు చేయాలని కోరాడు. వైఎస్‌ మరణానంతరం తమకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని శిష్టకరణ సామాజిక వర్గీయులు జగన్‌తో కష్టాలు చెప్పుకున్నారు. ఒకప్పుడు రాజుల వద్ద లెక్కలు రాసేవాళ్లమని, ప్రస్తుతం డాక్యుమెంట్‌ రైటర్స్‌గా కొనసాగుతూ పొట్టపోసుకుంటున్నామని చెప్పారు. తమకూ ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బాబు వస్తే ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి వస్తుందనుకున్నామని, తీరా ఏదీ లేదని పలువురు నిరుద్యోగులు వాపోయారు. చంద్రబాబును ఇక నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అందరి కష్టాలు ఓపికగా విన్న జననేత.. అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.  
 
జోరు వానలోనూ జనంతో మమేకం 
మధ్యాహ్న భోజన విరామం అనంతరం జగన్‌ భీమిలి శాసనసభానియోజకవర్గంలో ప్రవేశించినపుడు జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అడవివరం కూడలి వద్దకు చేరుకునేటప్పటికి వర్షం జోరు పెరిగింది. అయినా జగన్‌ లెక్కచేయక, వర్షంలో తడుస్తూనే ప్రజలకు అభివాదం చేస్తే ముందుకు సాగారు. పంచగ్రామాల బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్టణంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటయ్యేలా చూడాలని పలువురు న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. దువ్వపాలెం జంక్షన్‌ వరకూ పెద్ద సంఖ్యలో జనం జగన్‌ వెన్నంటి అడుగులో అడుగు వేశారు.    

అమరావతికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి 
రాజధాని పేరుతో అమరావతి నిర్మాణం అంతా మోసంగానే కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని ప్రతిపక్ష నేత జగన్‌ చెబుతున్నది నిజం. ఇంజనీరింగ్‌ విద్యార్థులు, మేధావులు, అమరావతికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ ఎలాంటి మోసాలు జరిగాయో ప్రజలకు వివరించాలి.       
– బీఎస్‌ఆర్‌ నాయుడు,విశ్రాంత లెక్చరర్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, విశాఖపట్నం 

ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీకి సరైన జీతాలు లేవు 
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీలకు సరైనా జీతాలు చెల్లించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది ఇక్కట్లు పడుతున్నారు. వీరి వేతనాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. మా సమస్యలన్నీ జగన్‌ గారికి చెప్పాము. ఈ ప్రభుత్వం విద్యా విధానాన్ని సర్వనాశనం చేస్తోంది. ఇష్టపూర్వకంగా చదవలేని పరిస్థితి నెలకొంది. పది, ఇంటర్‌లో ఇష్టానుసారం ఫీజులు గుంజుతున్నారు. ఈ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 
– చింతాడ రవికుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, విశాఖపట్నం  

మన ఇంజినీర్లను ప్రభుత్వం గుర్తించడం లేదు  
రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మోజులో పడింది. రాష్ట్రంలో అత్యుత్తమ ఇంజినీర్లు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం రాజధాని నిర్మాణం, ఇతర పనులను విదేశీ సంస్థలకు అప్పగించడం సరికాదు. దీంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి ఇక్కడ సరైన అవకాశాలు రావడం లేదు. పరిస్థితి ఇలాగైతే ఎలా.. అని ఇంజినీర్లందరూ బాధ పడుతున్నారు. మా సమస్యలన్నీ జగన్‌ గారికి వివరించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు.     
 – జ్యోతి, ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీ, విశాఖపట్నం 

అడ్డగోలుగా ఇంజినీరింగ్‌ ఫీజులు పెంచేస్తున్నారు   
ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. దీని వల్ల పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇంజనీరింగ్‌ విద్యకు దూరమవుతున్నారు. అష్టకష్టాలు పడి చదువుకున్న వారు ఉద్యోగాలు రాక ఇక్కట్లు పడుతున్నారు. అసలు ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేస్తేనే కదా? అందుకే మంచి విజన్‌ ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం. అది ఒక్క జగన్‌తోనే సాధ్యం.  రాష్ట్రం బాగుపడాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా జగన్‌ సీఎం కావాలి. 
– హరికుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, విశాఖపట్నం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement