తుపాను బాధితులను జగన్‌ ఆదుకుంటారు | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులను జగన్‌ ఆదుకుంటారు

Published Wed, Oct 17 2018 3:43 AM

YS Jagan helps Titli cyclone victims says YSRCP Leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బాధితులందరినీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తప్పకుండా ఆదుకుంటారని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలను పరిశీలించేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తదితరులతో కలిసి మంగళవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. బాధితులంతా తాగునీరు, తిండిలేక ఆకలి కేకలు వేస్తుంటే సీఎం చంద్రబాబు ప్రచారార్భాటం, ఫొటోల కోసమే పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారుల సమయమంతా సీఎం, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయడానికే సరిపోతోందని వారు విమర్శించారు.

తోటలు, పంట నష్టాల గుర్తింపులో అనేక ఆంక్షలు విధిస్తున్నారని.. ఏదో ఒకలా విస్తీర్ణం తగ్గించేసి తూతూమంత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు కానీ, నీటి ట్యాంకర్లు కానీ కనిపించట్లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు. దాదాపు 400 గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక, చంటిపిల్లలకు పాలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కానీ, సీఎం మాత్రం తాను ఇచ్చిన జాబితాలో పేరున్న వారికే నీరు ఇవ్వండని చెప్పడం దారుణమన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో టెక్నాలజీ ఏమైందని చంద్రబాబును పార్థసారధి ప్రశ్నించారు. న్యాయబద్ధంగా  పరిహారాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్,  సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ నేతలు కొలుసు పార్ధసారథి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్‌ (బుడ్డి), పెనమలూరు మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, సీడీసీ మాజీ చైర్మన్‌ నెరుసు సతీష్‌లు తుపాను బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సర్కార్‌ నిర్లక్ష్యానికి నిరసనగా..
శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను వచ్చి రోజులు గడుస్తున్నా బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం కాకపోవడం, ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని.. నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న ప్రజలు, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వారం రోజులు గడిచినా విద్యుత్‌ సరఫరా చేయరా అంటూ సాయిరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో వైఎస్‌ జగన్‌ రాక 
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తుపాను బాధితులందరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు. వారికి భరోసా ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమను ఆదేశించారన్నారు. త్వరలోనే ప్రతీఒక్క బాధిత కుటుంబాన్నీ ఆయన కలుస్తారన్నారు. ప్రభుత్వం నుంచి తగిన రీతిలో పరిహారం అందేవరకూ తమ పార్టీ పోరాడుతుందని ఆయన అభయం ఇచ్చారు. తుపాను బాధితులపట్ల మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఎవరికి ఓటేశారో వారినే పరిహారాలు అడగండని అవహేళన చేయడం సిగ్గుచేటన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement