ఉద్యోగాల విప్లవం తెస్తాం

YS Jagan comments about Jobs revolution in Srikakulam meeting - Sakshi

ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌.. ప్రభుత్వ సేవల డోర్‌ డెలివరీ

శ్రీకాకుళం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

పది మందితో పని చేసే గ్రామ సెక్రటేరియట్‌తో వలంటీర్ల అనుసంధానం 

సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం 

ప్రతి 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దనే అందేలా చర్యలు 

అధికారంలోకి రాగానే ఏటా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ  

ప్రైవేట్‌ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించేలా తొలి శాసనసభ సమావేశాల్లో చట్టం 

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేనలు మనల్ని మోసం చేశాయి 

వీరెవరినీ నమ్మొద్దు..మన ఓట్లు మనమే వేసుకుందాం 

25కు 25 ఎంపీలను వైఎస్సార్‌సీపీ తరఫున గెలిపించుకుందాం 

హోదా ఇచ్చే వాళ్లకే మద్దతిద్దాం 

అప్పుడే రాష్ట్రంలో ప్రతి జిల్లా ఓ హైదరాబాద్‌ అవుతుంది

ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా డోర్‌ డెలివరీ చేస్తారు. వీళ్లకు ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో గ్రామంలో సేవలందిస్తారు.
    – ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యవస్థలను సంస్కరించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఏపీపీఎస్‌సీ ద్వారా తక్షణమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఊరూరా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 10 మంది చొప్పున లక్షా 50 వేల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి నెల నెలా రూ.5000 పారితోషికం ఇస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే తెచ్చేలా పాలన అందిస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 316వ రోజు శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తెస్తామన్నారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఉద్యోగాల భర్తీకి ఏటా నోటిఫికేషన్లు 
‘‘పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం మనం తీసుకురాబోతున్నాం. రాష్ట్రం విడిపోయే నాటికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం మన పిల్లలు ఎదురు చూస్తూ.. ప్రిపేర్‌ కావాలని కోచింగ్‌ సెంటర్‌లకు వెళుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఈ పాలనలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు.. జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే జాబు రావాలంటే బాబు పోవాలి అనే పరిస్థితి. మనం అధికారంలోకి రాగానే చేయబోయే మొట్టమొదటి పని ఏమిటంటే.. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షా 42 వేల ఉద్యోగాలతో పాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడ్డ ఖాళీలు అన్నీ కలుపుకుంటే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలుంటాయి. ఈ రెండు లక్షలు ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రతి ఒక్కరికీ మాట ఇస్తున్నా. ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలకు ఒక డేట్‌ ఇచ్చినట్లు అదే మాదిరిగా ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి ఒక తేదీ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తాం.  
 
లంచమనేదే లేకుండా చేస్తాం.. 
ఇవాళ గ్రామాల్లో  ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిందే. జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి మాకు పెన్షన్‌ కావాలంటే వాళ్లు అడిగే మొదటి ప్రశ్న. మీరు ఏ పార్టీ వారు అని. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. గ్రామ సచివాలయాన్ని తీసుకు వస్తాను. ప్రతి గ్రామంలో సేవాగుణం వున్న 10 మంది పిల్లలను అదే గ్రామ సెక్రటేరియట్‌లో ఉద్యోగులుగా నియమిస్తాం. గ్రామ సచివాలయాన్ని తెరిచిన తర్వాత మీకు పెన్షన్‌ కావాలన్నా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలన్నా, వైఎస్సార్‌ చేయూత కావాలన్నా, ఇళ్లు కవాలన్నా, ఎటువంటి ప్రభుత్వ లబ్ధి కావాలన్నా దరఖాస్తు చేసిన 72 గంటల్లో శాంక్షన్‌ అయ్యేటట్టు చేస్తాం. మధ్యలో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదు. ఏ జన్మభూమి కమిటీ సభ్యుడు ఉండడు. ఏ ఎమ్మెల్యే ఉండడు, ఏ ఎమ్మార్వో ఉండడు, ఏ కలెక్టర్‌ ఉండడని హామీ ఇస్తున్నా. లంచమనేదే లేకుండా చేస్తాం. ప్రతి గ్రామంలో పది మంది పిల్లలను గ్రామ సెక్రటేరియట్‌లో ఉద్యోగులుగా నియమించడం ద్వారా లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయి.  
 
పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలొచ్చేలా చట్టం 
ఇవాళ మనం చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా సరిపోని పరిస్థితి. అందుకే ఏపీపీఎస్సీ, గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా కూడా అందరికీ మేలు చేయలేకపోవచ్చు. అందుకే  ప్రతి గ్రామంలో పెట్టే గ్రామ సచివలయం సరిగ్గా పని చేసేందుకు గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా ప్రతి ఇంటికి మేలు జరిగేలా చూడటం కోసం అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని వలంటీరుగా నియమించి రూ.5000 జీతం ఇస్తాము. ఉద్యోగం వచ్చే వరకు అదే గ్రామంలో ఉండి సేవ చేసే ఆలోచన ఉన్న వారికి అవకాశం ఇస్తాం. ఇలా వలంటీర్లుగా నియమించే వ్యక్తి 50 ఇళ్లను పర్యవేక్షిస్తూ ప్రతి ఇంటికీ మంచి జరిగేలా చూస్తాడు. గ్రామ సెక్రటేరియట్‌కు – ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం మీరు ఎక్కడికీ పోకుండా నేరుగా మీ ఇంటికే వచ్చేలా చూస్తానని చెబుతున్నా. ఎంత చేసినా ఉద్యోగాల సమస్య తీరదని నాకు తెలుసు. ఇంకో అడుగు ముందుకేస్తాము. ఎక్కడ చూసినా పరిశ్రమలు రావాలని, అవి వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆరాట పడతాం. తపిస్తాం. కానీ పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మాత్రం మన లోకల్‌ పిల్లలకు ఇవ్వరు. మన పక్కనే పరిశ్రమలు ఉంటాయి. మన ఇళ్లల్లో ఇంజనీర్లు ఉంటారు. ఉద్యోగాలు మాత్రం ఏ కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల వారికి ఇస్తారు. మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తాం. ఉన్న పరిశ్రమలు, ఏర్పాటు చేయబోయే వాటన్నిటిలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేసేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక చట్టాన్ని తీసుకువస్తాం. ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకువస్తామో అప్పుడే మన పిల్లలు పరిశ్రమలు రావాలని, వాటితో ఉద్యోగాలు వస్తాయని ఆశపడే పరిస్థితి వస్తుంది.  
 
ఎవరినీ నమ్మొద్దు.. మనమే బుద్ధి చెబుదాం 
ఉద్యోగాలు రావడం కోసం ఇన్ని చేసినా కూడా బహుశా అందరినీ సంతృప్తిపరిచే అవకాశం ఉండదేమో. అందుకే ఇంకో అడుగు ముందుకు వేస్తున్నాం. ప్రతి చదువుకునే పిల్లాడికి మరో హామీ ఇస్తున్నా. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎవరినీ నమ్మొద్దు. బిజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, జనసేనను నమ్మొద్దు. వీళ్లంతా కూడా దగ్గరుండి గత ఎన్నికల్లో మనల్ని మోసం చేసిన వారే. ఒకరు కత్తి ఇస్తే మరొకరు చేతులు, కాళ్లు పట్టుకుంటే ఇంకొకరు కత్తితో వెన్నులో పొడిచే కార్యక్రమం చేశారు. గత ఎన్నికల్లో బిజేపీ ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తానని చెబితే చంద్రబాబు దానికి వత్తాసు పలుకుతూ పది కాదు, 15 ఏళ్లు తీసుకువస్తానని మాట ఇచ్చాడు. ఇదే పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి వీరిద్దరికీ పూచీకత్తు నేను.. వీళ్లిద్దరితో నేను పని చేయిస్తానని చెప్పి ఓటు వేయండన్నాడు. నాలుగున్నరేళ్లు అయిపోయింది. ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేసిన పరిస్థితి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టకపోయి ఉండింటే అసలు ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేదే కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనే అంశాన్ని నిజంగా చట్టంలో పెట్టి ఉంటే మనం కోర్టు దాకా వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని ఉండేవాళ్లం. అలా చేయనందునే ఇవాళ మన బతుకులు ఇలా తగలబడ్డాయి. ఇప్పుడు మరోసారి మనల్ని మోసం చేయడానికి ఈ ఎన్నికల్లో అది చేస్తాం.. ఇది చేస్తామని మీ ముందుకు వస్తారు. వీరిని నమ్మొద్దు.  
 
ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల వెల్లువ 
ప్రత్యేక హోదా మనకు అవసరం. హోదాతోనే  పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే ఆదాయపు పన్ను, జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. అందుకే కొత్త పరిశ్రమలు, కొత్త హోటళ్లు, ఆస్పత్రులు, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే. దేవుడు ఆశ్వీరదించాలి. మీ అందరి చల్లని దీవెనలు కావాలి. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా రావాలని ఒక టెంకాయ కొట్టండి. మంచి మనసుతో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడదాం. దేవుడి దయ, మీ అందరి మద్దతుతో రేపు ప్రత్యేక హోదా మనం తెచ్చుకోగలిగితే ప్రతి జిల్లా ౖఒక హైదరాబాద్‌లా తయారవుతుంది. వీటన్నింటి వల్ల జరగబోయే కాలంలో చదువుకున్న పిల్లలను కొద్దోగొప్పో సంతృప్తి పరచగలమన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు పరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. తోడుగా నిలవండని అభ్యర్థిస్తున్నా. 
  
ఇన్ని సీట్లు గెలిపిస్తే బాబు చేసిందేమీ లేదు 
గడచిన 35 ఏళ్ల రాజకీయాలు చూస్తే సీట్లు, ఓట్లు తీసుకోవడంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీకే నంబర్‌ వన్‌. కానీ మన ఖర్మ ఏమిటంటే అభివృద్ధిలో మాత్రం ఈ జిల్లా అన్నిటి కన్నా అట్టడుగు స్థానంలో ఉంది. ఒకసారి మాత్రం 2004లో జిల్లా ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారిని గెలిపించారు. ఆ తర్వాత నాన్నగారు చేసిన పనులను చూసి వైఎస్సార్‌పై నమ్మకంతో మళ్లీ 2009లో జిల్లాలో పది స్థానాలుంటే 9 స్థానాలు గెలిపించారు. అప్పటి పాలన గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి ఈ వాళ్టికీ  ప్రజలు నా వద్దకు వచ్చి చెబుతున్నారంటే ఆ దివంగత నేతకు కొడుకుగా పుట్టడం పూర్వ జన్మసుకృతమని గర్వంగా చెబుతాను. ఇప్పుడు ఇక్కడి ప్రజలు నావద్దకు వచ్చి చెబుతున్న మాటేమిటంటే, అన్నా.. 2014లో 10 స్థానాల్లో ఏడు స్థానాలు చంద్రబాబుకు ఇచ్చామన్నా.. ఇవి సరిపోవని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన మరో ఎమ్మెల్మేను సంతలో పశువును కొన్నట్టుగా కొన్నాడన్నా.. ఇంతమంది ఎమ్మెల్యేను పక్కన బెట్టుకుని చంద్రబాబు మా జిల్లాకు, మా నియోజకవర్గానికి, మా శ్రీకాకుళానికి ఏం చేశారన్నా.. అని  ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ నాడు వైఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని నా దృష్టికి తీసుకు వచ్చారు. 
 
వంశధారను బాబు ఏనాడూ పట్టించుకోలేదు 
‘వంశధార ప్రాజెక్టుపై ఒడిశా రాష్ట్రంతో 55 ఏళ్లుగా తీరని వివాదం ఉంటే తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నా.. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే న్యాయపరమైన చిక్కులను తొలగించి వంశధార ప్రాజెక్టుకు 33 కిలోమీటర్లు కాలువలు తవ్వించి సింగిడి, హీరా తదితర మండలాలకు నీరు తెప్పించారు. 2005లో వంశధార ప్రాజెక్టు స్టేజ్‌ – 2 పనులకు రూ.930 కోట్లు కేటాయించారు. నాన్నగారు బతికుండగానే రూ.700 కోట్లు వెచ్చించి పనులు పరుగులు తీయించారు. మరో రూ.175 కోట్లు చంద్రబాబు సీఎం కాక ముందే కేటాయించారు. మిగిలిపోయిన పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా అవినీతి ప్రాజెక్టుగా మార్చేశారు. మిగిలిన రూ.55 కోట్ల పనులను రూ.476 కోట్లకు అంచనాలు పెంచేసి తన బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కంపెనీకి దోచిపెడుతున్నారన్నా.. రెండున్నర లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును దోపిడీకి గురయ్యేలా చేసి అన్యాయంగా వ్యవహరిస్తున్నా.. వంశధార వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు నేరేడు వద్ద బ్యారేజీ కట్టుకునేందుకు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా..’ అని స్థానికులు చెబుతున్నారు. మహీంద్రతనయ రిజర్వాయర్‌ పనులు నాలుగున్నరేళ్లుగా అంగుళం కూడా కదలని పరిస్థితి. ప్రజల కోసం ఏదైనా మొదలుపెడితే మధ్యలో ఆపకూడదని నాన్నగారు ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన కుమారుడిగా నేను చెప్పేదేమిటంటే వంశధార ప్రాజెక్టుకు సంబంధించి నేరుడు వద్ద బ్యారేజీ నిర్మించడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులు, బ్యారేజీ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను.  
 
అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్సార్‌ వల్లే 
‘మేము ఎందరో ముఖ్యమంత్రులను చూశామన్నా.. కానీ నాన్నగారి మాదిరిగా ఎవరూ కూడా మా జిల్లాను పట్టించుకోలేదు. నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక మా జిల్లాలో రిమ్స్‌ మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు. ఇప్పుడు ఇదే రిమ్స్‌ పరిస్థితి దారుణంగా ఉందన్నా.. 550 పడకల ఆస్పత్రిలో 240 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే 150 మంది మాత్రమే పని చేస్తున్నారు. సీటీ స్కాన్‌ రిపేరులో ఉంది. ఎంఆర్‌ఐ లేనే లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే దిక్కు దివానం లేకుండా ఉందన్నా. హాస్టల్స్‌లో మెడికల్‌ విద్యార్థులు కిక్కిరిసి ఉన్నారు. ఇవాళ ఈ కాలేజీకి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి నిరాకరించే పరిస్థితి దాపురించింది. 80 శాతం ప్రమాణాలను పాటించడం లేదు. పీజీ కోర్సులకు ఎంసీఐ అనుమతి ఇవ్వని పరిస్థితి. ఏదైనా అడిగితే ప్రభుత్వం ఇవ్వలేం, ఇవ్వం అంటోంది.

ఇదే జిల్లాలో నాన్నగారు అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈరోజు దాని పరిస్థితి ఎలా ఉందంటే.. 16 విభాగాల్లో 96 మంది అధ్యాపకులకు గాను 12 మంది మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన పని చేస్తున్నారు.  పోస్టులు మంజూరు చేయరు. స్కాలర్‌ షిప్‌లు ఇవ్వరు. వసతులు కల్పించరు. ఇంతత దారుణంగా యూనివర్సిటీని నడుపుతుంటే ఈ జిల్లాపై ప్రేమ ఉందని ఎలా చెప్పగలుగుతారన్నా’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా మా శ్రీకాకుళానికి, జిల్లాకు చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారన్నా. ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదన్నా అని ప్రజలు చెప్పుకొచ్చారు. 
 
ఇవి ఎక్కడైనా కనిపించాయా? 
శ్రీకాకుళంలో స్మార్ట్‌ సిటీ ఎక్కడైనా కనిపించిందా? రూ.348 కోట్లు ఇచ్చారా? రూపాయి కూడా ఇవ్వలేదు. శ్రీకాకుళంలో భూగర్భ డ్రైనేజీ అన్నాడు. ఎక్కడైనా అది కనిపించిందా? రింగురోడ్డు అన్నాడు. ఎయిర్‌పోర్టు అన్నాడు. ఫుడ్‌ పార్కు అన్నాడు. ఇవన్నీ ఎక్కడైనా కనిపించాయా? స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, టూరిజం సర్క్యూట్, నాగావళి, వంశధార కరకట్టల నిర్మాణం, కోడి రామ్మూర్తి స్టేడియం.. ఇవన్నీ కనిపించాయా? పేదల సంక్షేమం కోసం గతంలో రెండెకరాల స్థలాన్ని ఇంతకు ముందే కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్న అధ్వాన్నమైన పరిస్థితి. టీటీడీ కల్యాణ మండపం కోసం వైఎస్సార్‌ భూమి, నిధులు ఇచ్చారు ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఆ కల్యాణ మండపం కట్టలేదు. ఏసీ ఇండోర్‌ ఆడిటోరియంకు గతంలోనే నిధులు ఇచ్చినప్పటికీ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు.

చంద్రబాబు వచ్చాక జిల్లాలో 271 ప్రభుత్వ స్కూళ్లు మూతపడితే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏడు స్కూళ్లు మూతపడ్డాయి. జిల్లాలో 40  హాస్టళ్లను, శ్రీకాకుళం టౌన్‌లో ఒక ఎస్సీ హాస్టల్‌ను, ఒక బాలికల హాస్టల్, బందరువాని పేట వద్ద ఒక బీసీ హాస్టల్‌ మూసేశారు. శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్‌ ఐటీ తీరు అధ్వానం. ఈ ట్రిపుల్‌ ఐటీ పిల్లలను నూజివీడుకు తీసుకుపోయి అక్కడ చదివించే పరిస్థితి. రెండో సంవత్సరానికి సంబంధించిన వెయ్యి మంది విద్యార్థులను నూజివీడు నుంచి ఇక్కడకు తీసుకువచ్చి మూతపడిన ఇంజనీరింగ్‌ కాలేజీలో 500 మందిని పెట్టారు. మిగిలిన 500 మందిని గతంలో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి కట్టిన ట్వంటీ ఫస్ట్‌ గురుకులంలో పెట్టారు. ఇటువంటి వ్యక్తి (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడేనా? 
 
శవాలపై చిల్లర ఏరుకునే రకం 
నాన్నగారి హయాంలో శ్రీకాకుళం, చుట్టుపక్కల అక్షరాలా 11 వేల ఇళ్లు కట్టిస్తే, చంద్రబాబు పాలనలో ఇళ్ల పేరు చెప్పి స్కామ్‌లు చేస్తున్నారన్నా అని ప్రజలు అంటున్నారు. రూ.3 లక్షలు చేసే ఫ్లాట్‌ను రూ.7.80 లక్షలుగా పేదలపై భారం మోపుతున్నారు.  ఇందులో లక్షన్నర కేంద్రం, లక్షన్నర రాష్ట్రం ఇస్తోంది. మిగతా రూ.4.80 లక్షల అప్పును పేద వాడు 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3వేలు.. రూ.4 వేలు చొప్పున బ్యాంకులకు కట్టాలి. ఎన్నికల వేళ ఇస్తున్న ఆ ఫ్లాట్‌లను వద్దనకుండా తీసుకోండి. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక జగన్‌ అనే నేను అ అప్పును మాఫీ చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా.. హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం 192 ఇళ్లు కడితే పచ్చచొక్కాల వారికి మంజూరు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అసలు లబ్థిదారుల జాబితా కూడా బయట పెట్టడం లేదన్నా అని చెబుతున్నారు. నాలుగేళ్లుగా 189 మంది మత్స్యకారులు చనిపోతే చంద్రబాబు ఇస్తానన్న రూ.5 లక్షల నష్టపరిహారం ఒక్కరికీ ఇవ్వలేదని చెప్పారు. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులు నన్ను కలిశారు.

ఈ జిల్లాలో 2.8 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు రూ.400 కోట్లు డిపాజిట్లు చేశారు. ఆ అగ్రిగోల్డ్‌ అయినా సరే ఈ కేశవరెడ్డి అయినా సరే.. వీళ్లందరిపై ఎంక్వైరీ సిఐడీ చేస్తోందట. బాబుగారు తక్కువ రేటుకు ఆస్థులు కొట్టేస్తే ఆ ఆస్థులను మినహాయించేలా దర్యాప్తు సాగుతున్న పరిస్థితి. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎస్‌ఎమ్‌పురంలో 103 ఎకరాల్లో వైఎస్సార్‌ హయాంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్లలో ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. తిత్లీ తుపాను బాధితులను గాలికొదిలేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఇప్పటికీ కరెంటు సరఫరాను పునరుద్ధరించ లేదు. ఇదే జిల్లా నుంచి విద్యుత్‌ శాఖా మంత్రి కళా వెంకట్రావు ఏమీ పట్టించుకోని పరిస్థితి. తుపాను వల్ల రూ.3435 కోట్ల నష్టం జరిగితే అందులో కేవలం 15 శాతం అంటే రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చి, గొప్పగా ఇచ్చినట్లు అర్టీసీ బస్సులపై చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విడ్డూరం. ఈయన తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్టుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

బాబు బినామీలదే రాజ్యం  
చంద్రబాబు రాజధాని భూముల్లో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశాడు. అంటే రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా తన బినామీలకు చెప్పి భారీగా భూములు కొనుగోలు చేయించాడు. ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకుని మిగిలిన భూములను తనకు నచ్చిన వారికి నచ్చిన రేట్లకు నచ్చిన పద్ధతిలో కేటాయిస్తూ కమీషన్‌లు, వాటాలు దండుకుంటూ మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాజధానికి వచ్చే ఏ మనిషైనా చంద్రబాబు బినామీ హోటల్‌లోనే బస చేయాలి. ఆయన గారి బినామీ దుకాణాల్లోనే వస్తువులను కొనుగోలు చేయాలి. ఆయన బినామీల బిల్డింగ్‌ల్లోనే ఆఫీసులు పెట్టుకోవాలట. చివరకు నీరు, కరెంటు, టీవీలు ఏ సర్వీసు అయినా కూడా బాబు బినామీలకే కప్పం కట్టి తీసుకోవాలట. పాలు కూడా చంద్రబాబు  హెరిటేజ్‌ కంపెనీ నుంచే కొని తాగాలట. దానికి తగ్గట్టుగానే సహకార రంగంలోని డైరీలు.. చిత్తూరు, ఒంగోలు సహా అన్నింటినీ వరుసగా మూతపడే పరిస్థితి తీసుకువచ్చాడు.

చంద్రబాబు ఒక పథకం ప్రకారం సర్కార్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాడు. బిల్లులు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఇంటికి పంపే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు బినామీలైన నారాయణ, చైతన్య లేకపోతే మరో ప్రైవేటు స్కూళ్లకు పిల్లలు పోయే పరిస్థితిని కల్పిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టేందుకు తన బినామీలతో ప్రైవేట్‌ యూనివర్సిటీలను విచ్చలవిడిగా తీసుకువచ్చే వరకు వెళ్లాడు. ఎక్కడ చూసినా ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలే పెత్తనం చెలాయిస్తున్నాయి. మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. తుదకు దేవాలయాలు, కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులను సైతన ఆయన బినామీలకే కట్టబెడుతున్నాడు. తిరుపతి నుంచి అన్నవరం వరకు ఏడు ప్రధాన దేవాలయాల పారిశుద్ధ్య పనులను చంద్రబాబు తన బినామీ అయిన భాస్కరనాయుడుకు నాలుగు రెట్లు పెంచి కట్టబెట్టి లంచాలు తీసుకున్నాడు. ఇవాళ మనం ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు మనుషుల నుంచి మట్టి, ఇసుక కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. కింది నుంచి పైదాకా.. ఎమ్మెల్యే, మంత్రి, చినబాబు, పెదబాబు అందరికీ వాటాలు పోతున్నాయి. ఇలాంటి నాయకుడు అవసరమా? ఆలోచించండి.  

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేనలను నమ్మొద్దు. వేసే ప్రతి ఓటు కూడా మనమే వేసుకుందాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే వేసుకుందాం. 25 మందికి 25 మంది ఎంపీలను మనమే గెలిపించుకుందాం. 25 మంది ఎంపీలు మన దగ్గర ఉంటే ఆ తర్వాత ఎవరు ప్రధాన మంత్రి అవుతారో మనం నిర్ణయిస్తాం. ప్రధాని ఎవరైనా కానీ.. ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే మద్దతిస్తామని చెబుదాం. ఈ హక్కు మన దగ్గర పెట్టుకుని ఈ రాజకీయ పార్టీలకు, నాయకులందరకీ బుద్ది చెబుదాం. 
 
రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది. ప్రభుత్వ రంగాలను చంద్రబాబు తన స్వార్థం కోసం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్నాడు. సూటిగా చెప్పాలంటే మన రాజధాని భూముల నుంచి మొదలుపెట్టి తినే భోజనం, చదివే చదువులు, ఆస్పత్రులు, కేబుల్‌ టీవీలు అన్నీ కూడా చంద్రబాబు తన బినామీలకే అప్పగిస్తున్నాడు. ప్రైవేట్‌ సంస్థల ముసుగులో చంద్రబాబు దారుణాలు చేస్తున్నాడు. అన్నీ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలే. అన్నీ ఆయన బినామీ సంస్థలే. మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. 
 
ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ చంద్రబాబు దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నాడు. ఎక్స్‌రే యూనిట్‌ ఉంటే సిబ్బంది ఉండరు. సిబ్బంది ఉంటే ఎక్సరే యూనిట్‌ ఉండదు. అంబులెన్స్‌లు సరిగా ఉండవు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉండరు. మందులు ఉండవు. చివరకు ప్రభుత్వ ఆస్పత్రులంటే పనికి రావు అనే భావన కల్పించేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ భావన కల్పించాక, ఆస్పత్రుల్లోని సేవలను తన బినామీలకు రెండు, మూడు రెట్ల ధరకు కాంట్రాక్ట్‌ ఇచ్చుకుంటూ పోతున్నాడు.   

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ 
శ్రీకాకుళం అర్బన్‌/సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ కీలక నేత హాజీ అబ్దుల్‌ ఘనీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆయనకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ ఘనీ మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీకి సేవ చేశానని, గత సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ కోసం సీటు త్యాగం చేశానన్నారు. అయినప్పటికీ పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళుతోందని నమ్మి పార్టీలో చేరానన్నారు. కె.సురేష్‌కుమార్‌రెడ్డి, ఉపేంద్రరెడ్డి, జగన్, అమరనాథ్‌రెడ్డి, రమేష్‌లు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కాగా, తాను టీడీపీలో కొనసాలేని పరిస్థితిలో పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అబ్దుల్‌ ఘనీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపారు.   

వైఎస్సార్‌ జిల్లా టీడీపీ నేతల చేరిక: వైఎస్సార్‌ జిల్లా రాజంపేట రాజంపేట మున్సిపాలిటీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్, టీడీపీ నేత కటారు సుబ్బిరామిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనతో పాటు మరో 30 మంది టీడీపీ నేతలు పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి శనివారం వచ్చారు. వారందరికీ కండువా వేసి వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కుండ్ల రమణారెడ్డి, మాతా రమణ, రాము యాదవ్, కటారు చంద్రశేఖర్‌రెడ్డి, చప్పిడి శంకర్‌రెడ్డి, బి.నరేష్, కటారు అమరనాథ్‌రెడ్డి, జి.సురేష్, కటారు సుబ్బ నరసారెడ్డి, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top