అవిశ్వాస తీర్మానికి మేం రె‘ఢీ’: యడ్యూరప్ప

We Are ready For No Confidence Motion, Says Yeddyurappa - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్నాటకం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పష్టంచేశారు. సోమవారం వరకు చూసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. రమదా రిసార్ట్‌లో బీజేపీ ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ తర్వాత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. సోమవారం వరకూ వేచిచూస్తామని.. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. స్పీకర్ వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

మళ్లీ రిసార్టు రాజకీయాలు..
విశ్వాసపరీక్షకు రంగం సిద్ధమైన వేళ.. కర్ణాటకలో మళ్లీ రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీ తమ ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యశవంతపురలోని తాజ్‌వివాంత హోటల్‌లో, క్లార్స్‌ ఎక్సోటికా కన్వెన్షన్‌ రిసార్ట్స్‌లో క్యాంప్ చేస్తున్నారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు కూడా అక్కడినుంచి వచ్చి తిరిగి అక్కడికే వెళ్లిపోయారు. సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధం అనగానే, బీజేపీ కూడా అప్రమత్తమైంది. తక్షణమే తన ఎమ్మెల్యేలను క్యాంప్‌కి తరలించింది. రాజానుకుంటె సమీపంలోని రమదా రిసార్టులో బీజేపీ శాసనసభ్యులు బస చేస్తున్నారు. ఇక్కడ వీరి కోసం 30 గదులు బుక్‌చేసినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకు తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో ఉంచినట్టు మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. 

తీర్థయాత్రలో రెబెల్‌ ఎమ్మెల్యేలు
ఇక ముంబైలో క్యాంప్‌ చేసిన కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బీసీ పాటిల్‌, శివరామ్‌ హెబ్బార్‌, బసవరాజ్‌, సోమశేఖర్‌  నిన్న ముంబైలోని ప్రసిద్ధి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ అసంతృప్త ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో షిర్డీ వెళ్లారు. సాయిబాబాను దర్శించుకుని అక్కడి నుంచి శనిసింగనాపూర్‌ వెళ్లారు. విప్‌ జారీచేసినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top