అసమ్మతి సెగ.. టీడీపీలో భగభగ

Visakhapatnam District Electoral Review - Sakshi

విశాఖ ముఖచిత్రం

వెఎస్సార్‌ సీపీకి సానుకూల పవనాలు

వర్గ విభేదాలు, ప్రజా వ్యతిరేకతతో టీడీపీ సతమతం

వెంటాడుతున్న భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు

భీమిలి లేదా విశాఖ నార్త్‌ నుంచి లోకేశ్‌!

ఎంపీ అభ్యర్థులపై స్పష్టత కరువు

కల్మషం లేని గిరిజనం.. కల్చర్‌ నేర్చిన మెట్రో నగరం. ఉత్తరాంధ్ర ముఖద్వారం.. పర్యాటకుల స్వర్గధామం. ఉద్యమాలకు పురిటి గడ్డ.. తూర్పు నావికా స్థావరానికి కేంద్రం. ‘ఉక్కు’లాంటి మనుషులు.. వెన్నలా 
కరిగిపోయే మనసులు. ఇలాంటి విశిష్టతలెన్నో ఉన్న విశాఖ జిల్లాకు రాజకీయంగానూ ప్రత్యేకత ఉంది. ఎన్నికల నగారా మోగిన తరుణంలో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: గ్రామీణ పరిధిలో ఆరు, సిటీ పరిధిలో ఏడు, ఏజెన్సీలో రెండు కలిపి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుంచి కంభంపాటి హరిబాబు (బీజేపీ), అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (టీడీపీ), అరకు ఎంపీ స్థానం నుంచి కొత్తపల్లి గీత (వైఎస్సార్‌ సీపీ) విజయం సాధించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వస్తే వైఎస్సార్‌ సీపీ తరçఫున బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), గిడ్డి ఈశ్వరి (పాడేరు), కిడారి సర్వేశ్వరరావు (అరకు) గెలుపొందారు. విశాఖ ఉత్తరం నుంచి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. మిగిలిన 11 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. కాగా, ఆ తర్వాత ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు అధికార పార్టీ విరిజిమ్మిన నోట్ల కట్టలకు ఆశపడి ఫిరాయింపులకు పాల్పడ్డారు. నియోజకవర్గాల్లోని పరిస్థితిని పరిశీలిస్తే..

విశాఖ నగరం
విశాఖ తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ లెక్కలేనన్ని భూకబ్జాలు చేశారు. ఇక్కడ అత్యధికంగా ఉన్న మత్స్యకారులు, యాదవులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌ వంశీకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై పోరాటం చేస్తుంటారు. విశాఖ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పీజేవీఆర్‌ నాయుడు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదేళ్లలో పెచ్చుమీరిన అవినీతి, భూకబ్జాలు చేయడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ సీపీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ ఇక్కడ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీకి బలమైన క్యాడర్‌ ఉండటం వైఎస్సార్‌ సీపీకి కలసివచ్చే అంశం. విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్‌కుమార్‌ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐదేళ్లలో దందాలు, సెటిల్‌మెంట్స్‌తో వందల కోట్లకు పగడలెత్తారన్న ఆరోపణలున్నాయి. రౌడీ రాజకీయం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

వాసుపల్లికి టికెట్‌ ఇస్తే పార్టీ ఓటమి ఖాయమని సీనియర్‌ నేతలు పార్టీకి స్పష్టం చేశారు. పేదల డాక్టర్‌గా పేరొందిన డాక్టర్‌ పీవీ రమణమూర్తి ఇక్కడ వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి అన్ని పార్టీల కీలక నేతలు గురిపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు గెలుపొందారు. సీఎం కుమారుడు లోకేశ్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. యలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌బాబు, టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున కేకే రాజు కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. బలమైన క్యాడర్‌తో పాటు గడచిన ఎన్నికల్లో పనిచేసిన కీలక నేతలంతా వైఎస్సార్‌ సీపీలోనే ఉన్నారు.

భీమిలి
రాష్ట్ర మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపైనే అందరూ గురి పెట్టారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరగా, ఆయనను భీమిలి కో–ఆర్డినేటర్‌గా నియమించారు. ఇక్కడి పార్టీ శ్రేణులందరినీ కలుపుకుని అవంతి దూసుకుపోతున్నారు. తొలుత ఇదే సీటు కావాలని పట్టుబట్టిన గంటా ఇప్పుడు పెరిగిన వ్యతిరేకతతో ఇతర స్థానాలపై దృష్టి పెట్టినట్టు కన్పిస్తోంది. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు కూడా తెరపైకి వచ్చింది. 

యలమంచిలి
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన పంచకర్ల రమేష్‌బాబు ఈసారి పోటీకి ససేమిరా అంటున్నారు. విశాఖ ఉత్తరం సీటు కావాలని పట్టుబట్టారు. మంత్రి గంటాతోపాటు పలువురు ఈ సీటుపై కన్నేశారు. రమేష్‌బాబుకు సీనియర్ల సహకారం అందే అవకాశం లేదు. మరోవైపు వైఎస్సార్‌ సీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. మాజీ ఎమ్మెల్యే యూవీ రమణ మూర్తిరాజు (కన్నబాబు) నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు.

పాయకరావుపేట
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసమ్మతి నేతలు అమరావతిలో సీఎం కార్యాలయం ఎదుటే నిరసనలకు దిగారు. మంత్రి గంటా కేజీహెచ్‌ ఆర్‌ఎంవో బంగారయ్య అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మంత్రి కళా, విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మికి టికెట్‌ ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. వైఎస్సార్‌సీపీ  కో–ఆర్డినేటర్లుగా గొల్ల బాబూరావు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టుంది. గ్రామస్థాయిలో మంచి క్యాడర్‌ ఉంది.

నర్సీపట్నం
రాష్ట్ర మంత్రి అయ్యన్న ఈసారి తన కుమారుడు విజయ్‌ను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి సోదరుడు సన్యాసి పాత్రుడుతో ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో సాగించిన అవినీతి, అక్రమాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఈసారి ఇక్కడ టీడీపీ ఎదురీదడం ఖాయంగా కన్పిస్తోంది. వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌గా పెట్ల ఉమాశంకర గణేష్‌ వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి మంచి ఆదరణ ఉంది.

చోడవరం
టీడీపీ తరçఫున కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గ్రానైట్‌ గనులను లీజుకు పొంది అనుచరుల ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టారు. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌ సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యే మిలట్రీ నాయుడులతో పాటు సీనియర్లను కలుపుకుంటూ ధర్మశ్రీ దూసుకెళ్తున్నారు.

మాడుగుల
మాడుగుల నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ముత్యాలనాయుడు విజయం సాధించారు. శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరిస్తున్న ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. మరోవైపు టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గవిరెడ్డి రామానాయుడు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు గళం విన్పిస్తున్నారు.

అరుకు, పాడేరు
అరుకు నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కిడారికి గిరిజనులు పట్టం గట్టారు. ఆ తర్వాత టీడీపీ ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించారు. క్వారీలను అక్రమంగా చేజిక్కించుకుని దోచుకున్నారనే కారణంతో మావోలు అతడిని హతమార్చారు. కాగా, ఆయన కుమారుడు శ్రావణ్‌కు ఉప ఎన్నిక నిర్వహించకుండానే మంత్రి పదవి కట్టబెట్టారు. మరోవైపు వైఎస్సార్‌ సీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇక్కడ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న శెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాడేరు నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున గెలుపొందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీ ప్రలోభాలకు గురై పార్టీ ఫిరాయించారు. ఆమెను టీడీపీలో సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ బలమైన క్యాడర్‌తో దూసుకుపోతోంది. అగొడ్డేటి మాధి, పార్టీ కో–ఆర్డినేటర్‌ విశ్వేశ్వరరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి  పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. 

పెందుర్తి
ఇక్కడి నుంచి బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదేళ్లుగా తన తనయుడు అప్పలనాయుడు సాగించిన భూ కబ్జాలు, సెటిల్‌మెంట్స్‌ వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ నేతలు దళిత మహిళను వివస్త్రను చేసి అవమానించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ముదుపాక భూముల వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. మరోనేత   తనకు ఎమ్మెల్యే సీటే కావాలని బాబ్జి పట్టుబడుతున్నారు.  ఇదిలావుంటే.. వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌గా అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పోరాటాలు చేయడంతో వైఎస్సార్‌ సీపీకి మంచి ఆదరణ ఉంది. 

గాజువాక
గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రధాన సామాజిక వర్గమైన యాదవులను, సీనియర్‌ నేతలను పక్కన పెట్టడంతో అసంతృప్తి సెగలు ఎగసిపడు తున్నాయి. బినామీలను పెట్టుకుని వసూళ్లు, దందాలు సాగించడంతో ప్రజలకు దూరమయ్యారు. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌గా తిప్పల నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందడంతో ప్రజల్లో సానుభూతి ఉంది. కాగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.

అనకాపల్లి
వైఎస్సార్‌ సీపీ రూరల్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన గుడివాడ అమర్‌నా«థ్‌ ఇక్కడ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రైల్వే జోన్‌ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక ఆమరణ దీక్ష, పాదయాత్ర చేశారు. నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి దాడి వీరభద్రరరావు కుటుంబ సభ్యులతోపాటు అనుచర గణం వైఎస్సార్‌ సీపీలో చేరడంతో కొత్త జోష్‌ వచ్చినట్టయ్యింది. కాగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పీలా గోవింద్‌కు ఈసారి సీటు దక్కుతుందో లేదో అనుమానంగా ఉంది. మాజీ మంత్రి కొణతాల, మంత్రి గంటా కూడా ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. 

2019 జనవరి 11న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 32,80,028 మంది ఓటర్లు ఉండగా, కాగా ఆ తర్వాత వచ్చిన ఫారం–6 అందిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటి వరకు 2.09లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించారు. మార్చి 15వ తేదీ వరకు ఓటుహక్కు నమోదుకు అవకాశం ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top