హింసాత్మకంగా ఎన్నికలు, ఐదుగురు మృతి | Violence In West Bengal Panchayat Polls | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకం

May 14 2018 10:22 AM | Updated on May 14 2018 2:04 PM

Violence In West Bengal Panchayat Polls - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో 5 జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. బుర్ద్వాన్, కూచ్ బెహార్, ఉత్తర 24పరగణాలు, అసన్సోల్, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అసన్సోల్, కూచ్ బెహార్లలో నాటు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక బాగ్డాలోని పోలింగ్ కేంద్రంలోకి కొందరు వ్యక్తులు చొరబడి రిగ్గింగ్‌కు  ప్రయత్నించారు. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో టీఎంసీ కార్యకర్తలు, తమ పార్టీ శ్రేణులపై దాడి చేసి ఇళ్లు తగులబెట్టారని సీపీఎం ఆరోపించింది. పలు చోట్ల టీఎంసీ శ్రేణులు, ఓటర్లను తీవ్ర స్థాయిలో భయపెడుతున్నాయని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇక పోలింగ్ కేంద్రాలను దిగ్బంధించిన టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. కర్రలు, ఇనుపరాడ్లను పట్టుకొని ఓటర్లపై దాడులు చేశారు. ఏ పార్టీ కార్యకర్తవూ అని ఆరా తీస్తూ, తమ వాళ్లను పోలింగ్ కేంద్రాలకు పంపుతూ, మిగతా పార్టీల మద్ధతుదారులను తన్ని తరిమేశారు. కొన్ని చోట్ల బ్యాలెట్ పేప‌ర్ల‌ను నీళ్ల‌లో ప‌డేశారు. అంతేకాకుండా పలుచోట్ల ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లపైన కూడా దాడులు జరిగాయి. కొన్ని చోట్ల ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్‌ల‌లోకి వెళ్ల‌కుండా అడ్డుకుంటున్నారు. కోచ్ బేహార్‌ జిల్లాలో సంభవించిన చిన్నపాటి పేలుడు ప్రమాదానికి సుమారు ఇరవై మంది ప్రజలు గాయపడ్డారు. దక్షిణ 24 పరంగణాల జిల్లాలో వివిధ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో మీడియా వాహనం ధ్వంసమైంది.

ఈ ఎన్నికల సందర్భంగా 14 మంది తృణమూల్‌ కార్యకర్తలు మృతి చెందారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా.. గత వారం సుమారు 52 మంది చనిపోయారని బీజేపీ నేత ఒకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 2013 ఎన్నికల నాటి కంటే ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ గతవారం కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌..
సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం(ఎల​క్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లకు బదులు బ్యాలెట్‌ పేపర్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా సుమారు లక్షా యాభై వేల మంది భద్రతా సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 17న వెలుడనున్నాయి.

రాష్ట్రంలోని 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో గత నలభై ఏళ్లలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు  ఏకగ్రీవంగా గెలుచుకుంది.

అయితే గత నెల 2న పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీంతో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్‌ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించంగా ఎన్నికల కమిషన్‌ వాటిని తిరస్కరించింది. మరోవైపు ఉదయం 11 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైంది.

  • 58,639 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు
  • ఇప్పటికే సుమారు 20వేల స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తి
  • భాన్గర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
  • మీడియా వాహనాన్ని ధ్వసం చేసిన ఆందోళనకారులు
  • ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌, గాల్లోకి కాల్పులు జరిపిని పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement