వివాదాస్పద చట్టాలకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం

Vijayasai Reddy Demand For Special Grants To AP In All Party Meeting - Sakshi

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి

రాజధానిలో మౌలిక వసతులకు నిధులు కేటాయించాలి

రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం సాయం చేయాలి

అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీల డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాల ద్వారా దేశంలోని మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఎన్‌పీఆర్‌లో అడుగుతున్న సమాచారం గతం కంటే భిన్నంగా ఉందని, ఈ అంశాల అన్నింటిపై పార్లమెంటులో విసృతంగా చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. జాతీయ బడ్జెట్‌ నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మిథున్‌ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీలకు తమ పార్టీ వ్యతిరేకమని ఈ భేటీలో తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా హజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అఖిలపక్ష భేటీలో వారు ప్రస్తావించారు.

సమావేశం అనంతరం అఖిలపక్షంలో డిమాండ్‌ చేసిన అంశాలను ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా ముందు వెల్లడించారు. ‘విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. కాగ్ ఆడిట్ ప్రకారమే రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయాలి. రాజధానిలో మౌలిక వసతులకు తగిన నిధులు కేటాయించాలి. రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరాం. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరాం. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని వారి దృష్టికి తీసుకెళ్లాం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను కేంద్ర ఆమోదించాలి.

హోంశాఖకు మండలి రద్దు బిల్లు..
క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలి. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలి.. వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాం. మండలి రద్దు తీర్మానం ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని త్వరలోనే కేంద్రహోం శాఖకు అందుతుంది. ఆ తర్వాత న్యాయ శాఖ నుంచి కేబినెట్‌కు వెళుతుంది. ఆ తర్వాత బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభలకు చేరుతుంది. అక్కడ ఆమోదం పొంది.. రాష్ట్రపతి దగ్గరకు చేరనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో ఉన్న భారతీయును తిరిగి స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top