‘ పట్టపగలు దొంగతనం.. దేశ భద్రత పణంగా పెట్టి’...

Veerappa Moily Slams BJP Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సంధించారు. రాఫెల్‌ ఒప్పందాన్ని పట్టపగలు దొంగతనంగా ఆయన పేర్కొన్నారు. దేశ భద్రతను పణంగా పెట్టి రాఫెల్‌ ఒప్పందం చేశారని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్‌ ఒప్పందం దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణమని, దానిపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. 200 శాతం అంచనాలు పెంచి రాఫెల్ యుద్ధ విమానాలు ఎలా కొన్నారని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా గురించి చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు రాఫెల్ విమానాలు ఇండియాలో తయారు చెయ్యకుండా ఆ ఒప్పందం ఎలా చేసుకున్నారంటూ మండిపడ్డారు.

సుప్రీంకోర్టుకు, కేంద్ర సర్కార్ తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. అందుకే తీర్పు అలా వచ్చిందని, సుప్రీం కోర్టు ఈ కుంభకోణం తియ్యడంలో సరైన వేదిక కాదనే తాము కోర్టుకు వెళ్లలేదన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఏఎల్‌కి( హిందూస్తాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌) సామర్థ్యం ఉందని చెబితే నరేంద్రమోదీ మాత్రం నమ్మలేదని చెప్పారు. ఈ ఒప్పందాన్ని క్రోనీ క్యాపిటలిసంతో కూడుకున్న కుంభకోణమని పేర్కొన్నారు. రూ. 41000 కోట్ల డబ్బులు..  ప్రజల సొమ్ము డైరెక్ట్‌గా వృధా అవుతున్నాయన్నారు. రిలయన్స్, అనిల్ అంబానికి  లాభం చేకూర్చడం కోసమే ఒప్పందమని ఆరోపించారు. బెంచ్ మార్క్ రేట్ సరిగా లేదని అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ చెప్పారని, జాతి ప్రయోజనాలను పక్కన పెట్టి మోదీ ఈ ఒప్పందం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top