అపనమ్మకాలు, అపోహలు వద్దు

V Nagi Reddy Speaks About Municipal Elections In Telangana - Sakshi

నిబంధనల ప్రకారం పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి స్పష్టీకరణ

4న తుది ఓటర్ల జాబితా.. 6వరకు ఓటు నమోదుకు చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల విషయంలో ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి సూచించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే జనవరి 7న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడం అసాధ్యమని తెలిపారు. కొత్త మున్సిపల్‌ చట్టంలోని 195, 197 సెక్షన్లకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతితోనే ఈనెల 24న మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశామని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని స్పష్టంచేశారు.

 షెడ్యూల్‌ జారీ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కొత్త పద్థతి పాటించిందని, నోటిఫికేషన్‌ను వచ్చేనెల 7న బహిర్గతం చేయాల్సి ఉండగా, షెడ్యూల్‌ను ముందుగానే 24న విడుదల చేసిందని.. తద్వారా పార్టీలు, ఓటర్లను ముందుగానే ఎన్నికలకు సిద్ధం చేసినట్టు అయిందన్నారు. ఎస్‌ఈసీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంతో కుమ్మక్కై తొందరపాటుతో షెడ్యూల్‌ జారీ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ చట్టం, ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా  ఎన్నికలు జరుగుతాయన్నారు.

జనవరి 6 వరకు ఓటు నమోదు..
అసెంబ్లీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రాతిపదికన మున్సిపల్‌ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమైందని నాగిరెడ్డి తెలిపారు. ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకుని, ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి 2 వరకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మున్సిపల్‌ ఓటర్ల జాబితాలో లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తే మున్సిపల్‌ కమిషనర్లు సరిచేస్తారని వివరించారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు లేకున్నా.. జనవరి 6 వరకు ఫారం–6, 7, 8 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

జనవరి 4న వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాలు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. 7న నోటిషికేషన్‌ విడుదల తర్వాత 8న ఓటర్ల జాబితాలను రిటర్నింగ్‌ అధికారులు నోటీ సు బోర్డులపై ప్రదర్శిస్తారని, అదే రోజునుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.

అన్ని అంశాలూ వెబ్‌సైట్‌లో...
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను టీ పోల్‌ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు నాగిరెడ్డి తెలిపారు. ఓటరు స్లిప్పులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్ల కోసం వచ్చేనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు.

రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు...
మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్‌ డైరెక్టర్, మున్సిపాలిటీల వార్డులకు జిల్లా కలెక్లర్లు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని వివరించారు. జనవరి 4న సాయంత్రానికి రిజర్వేషన్లను పూర్తి చేసి 5న వెల్లడిస్తామన్నారు.

అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేశారు. సోమవారమిక్కడి ఓ ప్రైవేటు హోటల్‌లో మున్సిపల్‌ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు పరిశీలకులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల విషయంలో వ్యయ పరిశీలకులు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top