‘ప్రగతి నివేదన సభ తుస్సు..’

Uttam kumar Reddy Counter To KCR Speech In Pragathi Nivedana Sabha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ స్పీచ్‌ తుస్సుమనిపించిందని ఎద్దేవా చేశారు. సభకు ప్రపంచం నివ్వెరపోయేలా జనం రావటం కాదు.. ప్రపంచం నివ్వెర పోయేలా అవినీతి ప్రదర్శన జరిగిందన్నారు. ప్రజల సొమ్ము విచ్చల విడిగా ఖర్చు చేసి బలవంతగా బస్సులను సభకు తరలించారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభకు ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లెక్సీలను తొలగించారని గుర్తుచేశారు. కానీ  ఇప్పుడు అదే అధికారులు దగ్గరుండి కటౌట్‌లు కాపాడుతున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు సరిగా లేదని హెచ్చరించారు.

ప్రగతి నివేదన సభ కాదు.. ప్రజా ఆవేదన సభ అని ఉత్తమ్‌ విమర్శించారు.  సభకు 300 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఈ సొమ్ము ఎక్కడిదని, దోచుకున్నది కాదా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్,  గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్,  ఇంటికో  ఉద్యోగం వంటి హామీల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదని ప్రశ్నించారు. కరెంట్‌ విషయంలో కేసీఆర్‌ మళ్లీ అబద్దాలు చెప్పారని అన్నారు. జైపూర్‌, భూపాలపల్లిలో పవర్‌ ప్లాంట్‌లు కాంగ్రెస్‌ హయంలోనివేనని తెలిపారు.

మిషన్‌ భగీరథ ద్వారా 10శాతం ఇళ్లకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. తాగుడులో, రైతుల ఆత్మహత్యలలో, అప్పులు చెయ్యడంలో తెలంగాణను నంబర్‌ 1గా చేశారని మండిపడ్డారు. జోన్ల విషయంలో ప్రధానితో కోట్లాడానని చెప్పిన కేసీఆర్‌, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల అంశంపై ఎందుకు పోరాడలేదని నిలదీశారు. పెన్షన్‌లు పెంచుతామని చెప్పడం కాంగ్రెస్‌ పార్టీ విజయేనని ఆయన తెలిపారు. కోర్టులకు వెళ్తునందుకు నిందిస్తున్నారని.. టీఆర్‌ఎస్‌ అన్యాయాలపై, అక్రమాలపై కేసులు వేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఢిల్లీకి చెంచాగిరి చేస్తుంది కేసీఆర్‌.. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్‌ గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్తుందని వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top