బీసీలను మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌

Uttam kumar reddy commented over trs - Sakshi

చిత్తశుద్ధి ఉంటే ‘బీసీ కమిటీ’ ప్రతిపాదనలు ఆమోదించాలి: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: వెనకబడిన తరగతులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే కేబినెట్‌ బీసీ సబ్‌ కమిటీ రెండొందల అంశాలతో రూపొందించిన ప్రణాళికను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ సమావేశమందిరంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. 2017 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ హడావుడిగా బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీనైతే ఏర్పాటు చేశారే కానీ.. ఆ కమిటీకి కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కమిటీ చేసిన రెండొందల ప్రతిపాదనల్లో ఏ ఒక్కదాన్ని ఆమోదించలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి బీసీలంటే చులకన భావముందని, ఇందుకు బీసీ కమిటీకి ఇచ్చిన ప్రాధాన్యతే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోనే బీసీలకు న్యాయం జరిగిందని, పీసీసీ అధ్యక్షుడిగా నియమించి గౌరవం ఇచ్చామన్నారు.  

జనాభా ప్రతిపాదికన ఎన్నికల్లో రిజర్వేషన్లు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బీసీ జనాభా 54 శాతం ఉందని చెప్పారు. కార్పొరేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. అనంతరం ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. జనాభా ప్రకారం బీసీలకు నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.  

నిధుల్లేక నీరసించిన కార్పొరేషన్లు: ఆర్‌.కృష్ణయ్య
బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య అన్నారు. గత మూడేళ్లుగా కార్పొరేషన్లు నిధులు లేక నీరసించాయని, ఈ సారైనా సంతృప్తికర స్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

బీసీల హక్కులను సాధించుకోవాల్సిన అవసరముందని.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. త్వరలో బీసీ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని, ప్రభుత్వాలు స్పందించేవరకు పోరాటం ఆపమని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top