ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

Uppuleti Kalpana Visit Vuyyuru Hospital Krishna - Sakshi

న్యాయం చేయాలంటూ రాస్తారోకో

బాధితులకు అండగా కైలే అనీల్‌కుమార్‌

ఉయ్యూరు (పెనమలూరు) : కలాసమాలపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణ ఉయ్యూరులో ఉద్రిక్తతకు దారి తీసింది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై మహిళలతో పాటు ఆ గ్రామస్తులు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. బాధితులకు న్యాయం కోసం పేదల పక్షాన వైఎస్సార్‌ సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. దీంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాలిలా ఉన్నాయి. తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన క్షతగాత్రులు ఒకేచోట ఉండటంతో పెద్ద ఎత్తున జనం చేరుకుని వాదోపవాదాలకు దిగారు. దీంతో కొంత మందిని పోలీసులు విజయవాడ తరలించారు. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే కల్పనకు చేదు అనుభవం..
బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు ఆ గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మీకు న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే మహిళలతో అంటుండగానే నీ న్యాయం మాకక్కర్లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ రెండు చేతులూ జోడించి నిరసన తెలిపారు. కులం పేరుతో దూషించిన టీడీపీ నాయకుడు మురళీని వెనకేసుకొచ్చి తమను అణగతొక్కాలని చూశారంటూ ఎమ్మెల్యేను నిందించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించానని ఎమ్మెల్యే చెప్పి వెళ్లిపోయారు.

రోడ్డుపై రాస్తారోకో..
తోట్లవల్లూరు మండలం టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు నెక్కలపూడి మురళి ఆస్పత్రిలో ఓవరాక్షన్‌ దళితుల ఆగ్రహావేశానికి కారణమైంది. తమను కించపరిచేలా మురళి వ్యాఖ్యలు చేశాడంటూ దళితులు ఆందోళనకు ఉపక్రమించారు. ఎమ్మెల్యే కల్పనను, టీడీపీ శ్రేణులను నిలదీసి మురళిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దళితులకు అండగా వైఎస్సార్‌ సీపీ నేత అనీల్‌కుమార్‌ ఆందోళనలో పాల్గొన్నారు. ఈస్ట్‌ ఏసీపీ విజయభాస్కర్, సీఐ సత్యానందం ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ పల్లె వాతావరణాన్ని టీడీపీ పూర్తిగా కలుషితం చేస్తోందని ఆరోపించారు.

కులాల మధ్య ఎమ్మెల్యే కల్పన చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యతను ఎమ్మెల్యే విస్మరించడంతో కలాసమాలపల్లిలో మాలలు భౌతిక దాడులకు దిగారన్నారు. కేసులు లేకుండా అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. ఆందోళనలో వైఎస్సార్‌ సీపీ తోట్లవల్లూరు, పామర్రు మండలాల అధ్యక్షులు జొన్నల మోహన్‌రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, నాయకులు మారపాక మహేష్, యార్లగడ్డ శివయ్య, మర్రెడి శేషిరెడ్డి, ఇంతియాజ్‌ బాషా పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top