ఉత్తరప్రదేశ్: అడుగున్నర పొడవున్న ఒక సర్పాన్ని చలికోటులో దాచుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ హల్‌చల్ సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. 39 ఏళ్ల దీపక్ వృత్తిరీత్యా ఇ–రిక్షా డ్రైవర్. పాము కాటేసిందంటూ ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అయితే ఏ పాము కరిచిందో గుర్తుందా? అని అక్కడి సిబ్బంది అడగ్గా.. ఇదిగో ఇదే పాము అంటూ తన జర్కిన్‌లో దాచి తెచ్చిన తాచుపామును బయటకు తీశాడు.
దీంతో అక్కడి వాళ్లంతా హడలిపోయారు. వెంటనే పామును దూరంగా వదిలేసి రావాలని సూచించినా వినకుండా విరుగుడు మందు కావాలని డిమాండ్‌చేశాడు. దీంతో ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ‘‘సమీపంలోని బృందావన్ నుంచి వచ్చా. అరగంట నుంచి వేచిచూస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు’’అని దీపక్ చెప్పాడు. వైద్యం చేస్తాంగానీ ముందు ఆ పామును వదిలేయాలని సూచించామని జిల్లా ప్రభుత్వాసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్ చెప్పారు.


