‘హోదా’ క్రెడిట్‌ జగన్‌కు వస్తుందనే సీఎం ఫీట్లు | Sakshi
Sakshi News home page

‘హోదా’ క్రెడిట్‌ జగన్‌కు వస్తుందనే సీఎం ఫీట్లు

Published Sat, May 12 2018 4:29 AM

Undavalli Arunkumar fires on CM Chandrababu - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ పోరాటం చేస్తున్నారు. ఆయన బాటలోనే ఇతర ప్రతిపక్షాలన్నీ వచ్చాయి. హోదా ఒక సెంటిమెంట్‌గా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌కు ఆ క్రెడిట్‌ వస్తుందనే సీఎం చంద్రబాబు చివరి ఏడాది ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ ఫీట్లు చేస్తున్నారు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

విభజన సమయంలో లోక్‌సభలో జరిగిన ప్రహసనంపై వచ్చే శీతాకాల సమావేశంలో నోటీసులు ఇవ్వాలని, విభజనపై తాను సుప్రీంలో వేసిన పిటిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఆయన రాసిన లేఖను శుక్రవారం విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు. ఎన్నికలకు ఏడాది ఉందనగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది తానేనంటూ 11 చానళ్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామంటున్నారు. బీజేపీ అప్పడు కూడా కేంద్రంలో అధికారంలోనో, లేక ప్రతిపక్షంలోనో ఉంటుంది. మీపై కక్షతో ఇప్పుడు అడ్డుకుంటే  రేపు కూడా అడ్డుకోదా?’ అని ప్రశ్నించారు.  

ఫోజులు కొడుతుంటే ఎలా ఇస్తారు..?
‘‘రాష్ట్రం వెలిగిపోతోంది. 2029 ముందే ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రం అవుతుంది. గుజరాత్‌ కన్నా మనం ముందుకు పోతాం కాబట్టే అణిచివేస్తున్నారు. జీడీపీలో దేశం కన్నా మనమే టాప్‌ అంటూ ఫోజులు కొడుతుంటే.. అంతా బాగున్నవారికి హోదా ఎందుకు అని ఎవరైనా అనుకుంటారు. దేబిరించాల్సిన సమయంలో కాలుమీద కాలేసుకుని ఫోజులు కొడితే ఎలా?’’ అని ఉండవల్లి సీఎంని ప్రశ్నించారు. విభజనకు సంబంధించి లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో నోటీసులిస్తే.. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మీరంటే మీరే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్‌ దుమ్మెత్తి పోసుకుంటాయని, ఇలా అయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశం మొత్తం తెలుస్తుందన్నారు.   

Advertisement
Advertisement