కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్‌

Uncertanity Continues In Karnataka Assembly - Sakshi

బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష నాటకీయ పరిణామాల మధ్య పలు మలుపులు తిరుగుతోంది. విస్తృత చర్చ అనంతరమే విశ్వాస పరీక్ష చేపట్టాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు పట్టుబడితే..తక్షణమే సీఎం కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ విధించిన డెడ్‌లైన్‌ దాటిపోవడంతో సాయంత్రం ఆరు గంటల్లోగా బలపరీక్ష చేపట్టాలని గవర్నర్‌ తాజా డెడ్‌లైన్‌ విధించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి కర్ణాటక అసెంబ్లీకి సమాచారం అందింది. 

మరోవైపు విప్‌ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీకి 15 మంది అసమ్మతి ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న సుప్రీం ఉత్తర్వులపైనా ఈ పిటిషన్‌లో స్పష్టత కోరారు. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. విప్‌ జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న హక్కని ఆయన పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి , అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవద్దని కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.శాసనసభలో ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలని, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు.

రాష్ట్రపతి పాలన దిశగా..
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వజుభాయ్‌ వాలా జారీచేసిన ఆదేశాలను స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ బేఖాతారు చేయడంతో బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధమైంది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ జరగకపోవడం, అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం కర్ణాటకలో రాష్ట్రపతి పాలన దిశగా పరిణామాలు సాగుతున్నాయని భావిస్తున్నారు.మైనార్టీ ప్రభుత్యం కొనసాగుతున్నా స్పీకర్ సభను సాగదీస్తున్నారని, బలపరీక్షను ఎదుర్కొంటానని ప్రకటించింది ప్రభుత్వమే అయినా పరీక్షకు అవకాశం మాత్రం ఇవ్వడంలేదని గవర్నర్‌కు బీజేపీ మరోసారి ఫిర్యాదు చేయనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top