ఆహా.. యూపీలో ఏమి సహనం?!

Two Kashmiri Street Vendors Beaten In Lucknow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎవరైనా అంటే.. అన్న వారిని పట్టుకొని చావ చితక్కొడుతారు అక్కడి అల్లరి మూకలు. బుధవారం నాడు ఒక్క రోజులో జరిగిన నాలుగు దైర్జన్య, హింసాత్మక సంఘటనలు అక్కడి ‘సహనానికి’ మచ్చుతునకలు. లక్నోలో బుధవారం పట్టపగలు రోడ్డు పక్కన డ్రైఫ్రూడ్స్‌ అమ్ముతున్న ఇద్దరు కశ్మీరీలను పట్టుకొని కాషాయ దుస్తులు ధరించిన యువకులు చితకబాదారు. పైగా వారే వీరోచితంగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

(యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి)
 
అదే రోజు ముజాఫర్‌నగర్‌లో విద్యా, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ టీవీ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని వెతికి పట్టుకొని బీజేపీ కార్యకర్తలు చితక బాదారు. టెర్రరిస్టుగా ముద్ర వేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో సర్కులేట్‌ అవుతోంది. అదే రోజు సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లాలో బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రజల ముందే బహిరంగంగా కొట్టుకున్నారు. వారిద్దరు ఓ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. శంకస్థాపన పలకం మీద తన పేరు ఎందుకు లేదంటూ బీజేపీ ఎంపీ శరద్‌ త్రిపాఠి ప్రశ్నించారు. పేర్లు పెట్టదల్చుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ సింగ్‌ బాఘెల్‌ సమాధానం చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పట్టలేని ఆవేశానికి గురైన బీజేపీ ఎంపీ శరద్‌ త్రిపాఠి ఒక్కసారిగా తన కాలికున్న బూటును లాగి దాంతో బాఘెల్‌ నెత్తిపై ఠపీ ఠపీమంటూ కొట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనకు ప్రతీకారంగా జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయంలోకి ఎమ్మెల్యే అనుచరులు జొరబడి అక్కడున్న ఎంపీ శరద్‌ త్రిపాఠిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. (ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ)

అదే రోజు మీరట్‌లో గుడిశెవాసులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తమ గుడిసెలను తగులబెట్టారంటూ గుడిశెవాసులు రోడ్డెక్కి ప్రైవేటు వాహనాలను, బస్సులను దగ్ధం చేశారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంతటి ‘సహనం’ రాజ్యమేలుతుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆదిత్యనాథ్‌ యోగి ప్రభుత్వం ‘నయే భారత్‌ నయా ఉత్తరప్రదేశ్‌’ నినాదంతో ఇచ్చిన పూర్తి పేజీ యాడ్‌ అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురితమైంది. తన ప్రభుత్వం హయాంలో అన్ని నగరాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగయిందని, నేరస్థులను అనుమాత్రం ఉపేక్షించమనే తమ విధానం విజయవంతం అయిందని కూడా ఆ యాడ్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఆ యాడ్‌ మధ్య భాగంలో శాంతి భద్రతల పరిస్థితి మెరగయిందన్న శీర్షిక కింద నేరాల పట్ల అణు మాత్రం సహించని విధానాన్ని అమలు చేస్తున్నామని, పోలీసు బృందాల ఎన్‌కౌంటర్ల వల్ల 69 మంది నేరస్థులు మరణించారని, 7043 మంది అరెస్టయ్యారని, ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పును గమనించి 11,981 మంది నేరస్థులు తమ బెయిళ్లను రద్దు చేసుకొని కోర్టుల ముందు హాజరయ్యారని చెప్పడంతో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవల గురించి, లక్ష మంది పోలీసుల నియామకానికి ప్రక్రియ కొనసాగుతోందని కూడా ఆ యాడ్‌లో పేర్కొన్నారు.

బుధవారం జరిగిన నాలుగు, దౌర్జన, హింసాత్మక సంఘటనలకు సబంధించిన వీడియోలు అందుబాబులో ఉన్నా ఒక్క గుడిశెవాసులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి మినహా మిగతా మూడు సంఘటనల్లో పోలీసులు ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్‌ చేయలేదు. అనవసరమైన పబ్లిసిటీ పేరిట లక్షల రూపాయలు తగిలేసే బదులు, శాంతి భద్రతల పరిరక్షణకు కేటాయిస్తే ఎప్పటికైనా ‘సహనం’ వస్తుందేమో!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top