‘చౌకీదార్‌’ నవ్వులపాలు

Twitterati Mocks On Prefix Chowkidar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మై బీ చౌకీదార్‌’! అవినీతి వ్యతిరేక పార్టీగా బీజేపీపై పడిన ముద్ర చెదరిపోతున్న సమయంలో దాన్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన ఆ మరునాడు ఆదివారం తన ట్విటర్‌ ఖాతాలో పేరుకు ముందట ‘చౌకీదార్‌’ అనే ట్యాగ్‌ను తగిలించుకున్నారు. ఆయన స్ఫూర్తితో అదే రోజు నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, నితిన్‌ గడ్కారీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ‘చౌకీదార్‌’ ట్యాగ్‌ను తగిలించుకున్నారు.

ఈ ప్రహసనంపై ట్విటర్‌లో సోమవారం నుంచి వ్యంగోక్తులు దుమ్ము రేపుతున్నాయి. ‘అచ్చేదిన్‌ నహీ లాయాతో అప్నా నామ్‌ బదల్‌ దూంగా’ అంటూ మీరు ప్రతిజ్ఞ చేసి విఫలమైనందుకు పేరు మార్చుకున్నారా? అంటూ ఒకరు, మా చౌకీదార్‌ కనిపించడం లేదు. నేనే చౌకీదార్‌గా ఉంటున్నా, అచ్చేదిన్‌ను వెతుక్కుంటూ మా చౌకీదార్‌ వెళ్లాడని తెల్సింది అంటూ మరొకరు, భారత్‌ను బలంగాను, భద్రంగాను మారుస్తానని మీటూ నిందితుడు, మీ మాజీ మంత్రి ఎంజె అక్బర్‌ ప్రతిజ్ఞ చేస్తారు, మీరేమో చౌకీదార్‌ డ్యూటీ చేస్తానంటారు అంటూ ఇంకొకరు వ్యంగ్యోక్తులు విసిరారు.

కార్టూనిస్టులు కూడా తమదైన శైలిలో వ్యంగ్యం పండించారు. పలు కార్టూన్లను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. ఓ ట్వీటరయితే బ్యాంక్‌ చౌకీదారే తాను పనిచేస్తున్న బ్యాంక్‌కు కన్నం వేస్తున్న దృశ్యంతో కూడిన పాత యాడ్‌ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top