మిత్రులే..ప్రత్యర్థులు!

TRS Rebels Starts Election Campaign Without Ticket Issue - Sakshi

నగరంలో ఆరు నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌

స్వతంత్రంగా పోటీకిసిద్ధమవుతున్న వైనం

కొన్నిచోట్ల అభ్యర్థులనుప్రకటించకున్నాప్రచారం షురూ...

అధికార పార్టీకి తొలగని తలనొప్పులు

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు పలు నియోజకవర్గాల్లో సొంత పార్టీ మిత్రులే ప్రత్యర్థులు కానున్నారు. నగరంలో పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పలు నియోజకవర్గాల్లో దారికి రాని అసంతృప్త నేతలు పోటీలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే గనుక జరిగితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని టికెట్లు ఆశించి భంగపడిన టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. ఇందులో నియోజకవర్గాల వారీగా చూస్తే కూకట్‌పల్లిలో బాలాజీనగర్‌ కార్పొరేటర్‌ భర్త పన్నాల హరీష్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులందరినీ ఆయన ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కుత్బుల్లాపూర్‌ స్థానాన్ని టీడీపీ నుంచి వచ్చిన వివేకానంద్‌కు ఇవ్వటంతో, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొలను హన్మంతరెడ్డి ఈమారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించారు. ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అసంతృప్త నేతలతో పార్టీ ముఖ్యనేతలు పలుమార్లు చర్చలు జరిపినా కార్పొరేటర్లు దారికి రాలేదు. పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో కార్పొరేటర్లు కిలారీ మనోహర్, షఫీ, సంజయ్‌ తదితరులు మాగంట గోపీనాథ్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిలిచే బలమైన అభ్యర్థికి మద్దతిచ్చే అంశాలను పరిశీలిస్తున్నారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోఅభ్యర్థి సుభాష్‌రెడ్డికి కార్పొరేటర్ల సహాయ నిరాకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందరినీ సమన్వయం చేయటంలో అభ్యర్థి తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్‌ రాంమోహన్, ఇటీవలే టీఎఆర్‌ఎస్‌లో చేరిన బండారి లక్ష్మారెడ్డి సైతం పెదవి విరుస్తున్నారు.

ప్రకటించకున్నా ప్రచారంలోకి..
ఇంకా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించని ఖైరతాబాద్, అంబర్‌పేట, మల్కాజిగిరి, గోషామహల్‌ నియోజకవర్గాల్లో ఎవరికి వారే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌లో కార్పొరేటర్‌ విజ యారెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డిలతో పాటు ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎవరికి టికెట్‌ ఇచ్చినా..ఇందులో మరొకరు పోటీ చేసే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోనూ తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తొలుత కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్‌ విజయశాంతికి టికెట్‌ ఖరారైనట్లు సంకేతాలిస్తే..అలకబూనిన మైనంపల్లి సొం తంగా పోటీ చేసే ఏర్పాట్లు చేశారు. తాజాగా మైనంపల్లికి టికెట్‌ ఇస్తున్నట్లు సంకేతాలివ్వటంతో కనకారెడ్డితో పాటు కార్పొరేటర్లు బద్దం పుష్ప, ఆకుల నర్సింగ్‌రావు, కటకనేని శ్రీదేవిలు తీవ్రం గా వ్యతిరేకిస్తూ.. కనకారెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌కు టికెట్‌ ఖరారైన వార్తల నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డితో పాటు, రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూడాలనే ధోరణిలో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top