కారు..జోరు..

TRS Party  Winning Josh In wanaparthy - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ తన సత్తా చాటింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని కారు జోరును ప్రదర్శించింది. అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్‌ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ మంగళవారం వెలువడిన పరిషత్‌ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసింది. జిల్లాలో మెజార్టీ మండల, జిల్లా పరిషత్‌ పీఠాలను కైవసం చేసుకోనుంది. మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలకు 17 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా, 3 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ మెజార్టీ స్థానాలు అధికార పార్టీ గెలుపొందింది. అమ్రాబాద్‌ మండలంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది. బిజినపల్లి, కోడేరు, ఉప్పునుంతల, లింగాల మండలాల్లో హంగ్‌ ఏర్పడింది. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. ముందుగా ఎంపీటీసీ పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వాత ఎంపీటీసీ బ్యాలెట్‌ పత్రాలను అనంతరం జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగింది. కలెక్టర్‌ శ్రీధర్‌ కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.

17 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం 
జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ నెగ్గింది. తాడూరు మండల జెడ్పీటీసీ స్థానాన్ని కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిణి 83 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిమ్మాజీపేట జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.దయాకర్‌రెడ్డి 3,418 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌  జెడ్పీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీశైలం 2,967 ఓట్లతో నెగ్గాడు. లింగాల  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాట్రావత్‌ భాగ్యమ్మ 2,362 ఓట్లతో గెలుపొందారు, అమ్రాబాద్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ అనురాధ 2,362 ఓట్లతో నెగ్గారు. బల్మూర్‌  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వల్లపు లక్ష్మమ్మ 2,572 ఓట్లతో, కొల్లాపూర్‌  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి భాగ్యమ్మ 8,176 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఊర్కొండ మండల  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి శాంతికుమారి 2,209 ఓట్లతో గెలుపొందారు. బిజినపల్లి జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిచరణ్‌రెడ్డి 3,584 ఓట్లతో, వెల్దండ జెడ్పీటీసీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజితారెడ్డి 5,065 ఓట్లతో, పెంట్లవెల్లి  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌  అభ్యర్థి చిట్టెమ్మ 3,761 ఓట్లతో, చారగొండ జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌  అభ్యర్థి బాలాజీసింగ్‌ 3,454 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. తెలకపల్లి  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మావతి 2,264 ఓట్లతో, అచ్చంపేట  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మూడావత్‌ మంత్రయ్య 3,717 ఓట్లతో, వంగూరు మండల  జెడ్పీటీసీగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెంకటనర్సింహారెడ్డి 532 ఓట్లతో,  పెద్దకొత్తపల్లి జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గౌరమ్మ 11,610 ఓట్లతో, కోడేరు  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త రమాదేవి 5,661 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. కల్వకుర్తి  జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌ 2,150 ఓట్లతో, ఉప్పునుంతల జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి 264 ఓట్లు, పదర  జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాంబాబు 986 ఓట్లతో నెగ్గారు. జెడ్పీ చైర్మన్‌గా పోతుగంటి భరత్‌ పేరు దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం.

ఎంపీటీసీల్లోనూ టీఆర్‌ఎస్‌దే పైచేయి  
జిల్లాలోని 212 ఎంపీటీసీ స్థానాలుంటే గోప్లాపూర్, గంట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 209 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 135 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా కాంగ్రెస్‌ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 2 స్థానాల్లో, సీపీఐ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 16 స్థానాల్లో విజయం సా«ధించారు. ఏకగ్రీవం అయిన రెండు ఎంపీటీసీ స్థానాలు కూడా మొత్తం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 137 స్థానాల్లో విజయం సాధించినట్లు అవుతుంది. జిల్లాలోని 20 మండలాల్లో మెజార్టీ మండలాల్లో పరిషత్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. ఒక్క అమ్రాబాద్‌ మండలంలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది. అక్కడ మొత్తం 9 స్థానాల్లో ఎనిమిదింటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, టీఆర్‌ఎస్‌కు ఒకటే స్థానం దక్కింది. మరోవైపు ఉప్పునుంతల, లింగాల మండలాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు సమానంగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. బిజినేపల్లి, కోడేరు మండలాల్లో హంగ్‌ ఏర్పడింది. ఈ నాలుగు మండలాల్లో క్యాంప్‌ రాజకీయాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
 
7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక..
 
7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్‌ కోసం ఎన్నికలు నిర్వహించేలా ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 15 మండలాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే ఎంపీటీసీలుగా గెలుపొందడంతో ఆ మండలాల్లో అధికార పార్టీకే ఎంపీపీ పీఠాలు దక్కనున్నాయి. తొలి జెడ్పీ చైర్మన్‌ పీఠం కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే పడనుంది. ప్రాదేశిక పోరులో గులాబీ దళం విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం తెచ్చింది.

బల్మూర్‌ మండలం రామాజిపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అభినందిస్తున్న ఎమ్మెల్యే గువ్వల   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top