అంతా ఎమ్మెల్యేలే...

TRS looking to sweep upcoming local body polls in Telangana - Sakshi

టికెట్ల కేటాయింపు, గెలుపు బాధ్యత వారికే

పరిషత్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ వ్యూహం

తొలివిడత ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ..పరిషత్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అన్ని జడ్పీలు, ఎంపీపీలను కైవసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహం అమలు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల పంపిణీ, గెలుపు బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలకే అప్పగించింది. పరిషత్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నామని, గెలుపోటములకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల తొలిదశ ప్రక్రియ సోమవారం మొదలైంది.నామినేషన్ల దాఖలు ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పలువురు ఎమ్మెల్యేలతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు.

పరిషత్‌ ఎన్నికలలో అమలు చేయాల్సిన వ్యూహాన్ని వివరించారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గెలుపు అవకాశాలను ప్రతిపాదికగా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారని, అందరినీ కలుపుకునిపోయే వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులతో గ్రామాల్లో ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారని, ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులకు ఎంపిక చేస్తే గెలుపు సునాయాసమవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలోనే ఎలాంటి అసంతృప్తులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆశావహులు అందరు నామినేషన్‌ దాఖలు చేసిన చర్చించి ఒప్పించడం వల్ల గందరగోళ పరిస్థితులు ఉంటాయని, ముందుగానే సమావేశం నిర్వహించి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసేలా చూడాలని ఆదేశించారు.  

స్థానిక అంశాలు...
జెడ్పీటీసీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం ఉండాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా ఎమ్మెల్యేలు ప్రయత్నించాలని ఆదేశించారు. ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులలో అధికార పార్టీ వారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గ్రామాలు సమగ్ర అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకోవాలని... దీనికి అనుగుణంగా ఎమ్మెల్యేలు పని చేయాలని ఆదేశించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top