మండలిలో గులాబీదే ‘పెద్దరికం’

TRS achieved full dominance in the Legislative Council - Sakshi

పెద్దల సభలో టీఆర్‌ఎస్‌కు పూర్తి ఆధిక్యత 

రెండు స్థానాలతో ప్రతిపక్షంగా ఎంఐఎం 

కాంగ్రెస్, బీజేపీకి ఒక్కొక్కరే సభ్యులు 

ఎమ్మెల్సీ విజేతలకు కేటీఆర్‌ అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో టీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిపత్యం సాధించింది. తాజాగా ఎన్నికలు జరిగిన 4 ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్యే కోటాలోని 5 స్థానాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ 4, ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. వరుస గెలుపులతో మండలిలో టీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిపత్యం సాధించింది. 

ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్‌ 
తెలంగాణ శాసనమండలిలో 40 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 37 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు 31 మంది ఉన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ మండలిలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే మిగిలారు. ఇటీవల ఎన్నిక జరిగిన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్‌ నేత టి.జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం శాసనమండలిలో ఆయన ఒక్కరే పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తాజాగా ఎన్నికలు జరిగిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పరా జయం పాలయ్యారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహించేది. తాజా ఎన్నికల్లో అక్కడా ఓటమి పాలైంది. ఇలా శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఒకే స్థానం ఉండటంతో సంఖ్యా పరంగా బీజేపీతో కలిసి మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు పెద్దలసభలో చెరొక సభ్యుడు ఉన్నారు. ఉపాధ్యాయుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సభ్యులు ఇద్దరు ఉన్నారు. శాసనమండలిలో ఇద్దరు సభ్యులతో ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. 

టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు : కేటీఆర్‌ 
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే పరిషత్‌ ఎన్నికల్లోనూ ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌)లను కేటీఆర్‌ అభినందించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగ దీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అభినందించారు. నేడు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రి యలో, ఆ తర్వాత జరిగే జిల్లా పరిషత్‌ చైర్మన్, మం డల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నిక వరకు ఇదే ఉత్సాహం తో పనిచేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు కేటీఆర్‌ ట్విట్టర్‌లోనూ అభినందనలు తెలిపారు. 

పోచంపల్లికి దేశంలోనే సరికొత్త రికార్డు.. 
వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రికార్డు విజయం సాధించారు. శ్రీనివాస్‌రెడ్డి గెలుపు దేశంలోనే సరికొత్త రికార్డుగా నమోదైంది. పోలైన ఓట్లలో 96.06 శాతం ఓట్లు శ్రీనివాస్‌రెడ్డి దక్కించుకున్నారు. పోలైన 883 ఓట్లలో 848 ఓట్లు శ్రీనివాస్‌రెడ్డికి దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పోచంపల్లి రికార్డు గెలుపు నమోదు చేసుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top