‘ఆమె కాలనాగు, పనికిరాని ఆర్థికమంత్రి’ | Sakshi
Sakshi News home page

ఆర్థికమంత్రి నిర్మలపై టీఎంసీ ఎంపీ తీవ్ర విమర్శలు

Published Sun, Jul 5 2020 4:39 PM

TMC MP Kalyan Banerjee Calls Nirmala Sitharaman As a Venomous Snake - Sakshi

కోల్‌కతా : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని ఆరోపించారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమె ఓ కాలనాగు అని, పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్‌ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రైల్వేలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆయన వ్యతిరేకించారు. 

కాగా, టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తన పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని రాష్ట్ర  బీజేపీ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో అవినీతి ఘోరంగా పెరిగిపోయిందని, కిందిస్థాయి నేతల నుంచి పెద్దస్థాయి నేతల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఎంసీలో అంతర్గత వైరుధ్యం మొదలైందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇలాంటి వ్యాఖ్యలకు తాము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వమని, నిరాశతో ఇలాంటి అర్ధంలేని మాటలు చెబుతున్నారని దిలీప్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement