ఎంతకాలం ఈ సాగదీత?

Tjs core committee is impatient on seat adjustment - Sakshi

సీట్ల సర్దుబాటుపై టీజేఎస్‌ కోర్‌ కమిటీ అసహనం

జాప్యం కొనసాగితే 15 సీట్లలో పోటీకి దిగాలని యోచన

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై జరుగుతున్న సాగదీత వైఖరిపై తెలంగాణ జనసమితి అసహనం వ్యక్తం చేసింది. టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం. కోదండరాం నేతృత్వంలో పార్టీ కోర్‌ కమిటీ సోమవారం సమావేశమైంది. సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. పార్టీ కార్యాలయంలోనే జరిగిన అంతర్గత సమావేశంలో సీట్ల సర్దుబాటును పూర్తి చేయకుండా కాంగ్రెస్‌ సాగదీయడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా సీట్ల పంపకాలను తేల్చేవిధంగా ఒత్తిడి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.

సీట్ల సర్దుబాటు వ్యవహారం సత్వరమే పూర్తయ్యేలా మిత్రపక్షాలైన టీటీడీపీ, సీపీఐతో కలసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని పలువురు ముఖ్యులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలో పట్టున్న ముఖ్యమైన 15 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్దామని కొందరు టీజేఎస్‌ ముఖ్య నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. టీజేఎస్‌కు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్‌ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో పొత్తుల విషయమై తాడోపేడో తేల్చాలని కోదండరాంపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలియవచ్చింది.

కోదండరాంతో రమణ, చాడ భేటీ...
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి, సోమవారం సమావేశమయ్యారు. టీజేఎస్‌కు 12 సీట్లు ఇవ్వాలని కోదండరాం కోరుతుండగా సీపీఐ కనీసం 6 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇప్పటిదాకా టీజేఎస్‌కు 8 సీట్లను ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. సీపీఐ కూడా సీట్ల సర్దుబాటుపై అసహనం వ్యక్తం చేస్తోంది. బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, దేవరకొండ, మునుగోడు స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top