జనగామ నుంచి కోదండరాం? | Sakshi
Sakshi News home page

జనగామ నుంచి కోదండరాం?

Published Fri, Nov 9 2018 4:56 AM

TJS Chief Kodandaram May Contest From Jangaon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: టీపీసీసీ, టీజేఎస్‌ పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదిరింది. గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షు డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్‌లతో టీజేఎస్‌ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి దిలీప్‌కుమార్, ముఖ్యనేతలు రాజేందర్‌రెడ్డి, గోపాల్‌శర్మలు సమావేశమయ్యారు. టీజేఎస్‌కు 8 స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 5 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, మరో మూడు స్థానాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని టీజేఎస్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తున్న 8 సీట్ల పై టీజేఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాంగ్రెస్‌ ఇస్తామన్న 8 స్థానాల్లో తమకు బలం లేదని, తమకు పట్టున్న, తాము సూచించిన 8 స్థానాల్లోనే సీట్లు కేటా యించాలని టీజేఎస్‌ అధినేత కోదండరాం గురువారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. పొత్తుల్లో భాగంగా జనగామ నుంచి ప్రొఫెసర్‌ కోదండరాం పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం జనగామ, మెదక్, మల్కాజిగిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలను టీజేఎ స్‌కు కేటాయించబోతున్నట్టుగా తెలిసింది. అయితే మరో రెండు సీట్లు కావాలని కోదండరాం పట్టుబడుతున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహబూబ్‌నగర్, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలు తమకు కావాలని కోదండరాం కోరుతున్నట్టుగా సమాచారం. సీట్లపై చర్చలు తుదిదశకు చేరుకున్న దశలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించడానికి కోదం డరాం శుక్రవారం ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. కోదం డరాం ఢిల్లీ పర్యటన అనంతరం చర్చలకు సంబం« దించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement
Advertisement