
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ అధ్యక్షుడి సూచనల మేరకు ఎన్నికల్లో ప్రచారం చేస్తానని మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ తెలిపారు. ఆమె గురువారం తన కుమారుడు నీహార్ కపూర్‌తో కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా జయసుధకు, ఆమె కుమారునికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, ఏ నిర్ణయమైనా పార్టీ అధ్యక్షుడిదే అంతిమమని పేర్కొన్నారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నటులు జగన్‌ను కలవడాన్ని, పార్టీలో చేరడాన్ని చంద్రబాబు విమర్శిస్తున్నారన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నోటి నుంచి అలాంటి మాటలు రాకూడదన్నారు. సినిమా వాళ్లు ఎందుకు జగన్‌ను కలవకూడదు? అయినా చంద్రబాబు ఇంటి వాళ్లంతా సినిమా వారే కదా? అని గుర్తు చేశారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా చెబితే అలా నడుచుకున్నానని.. ఇప్పుడు కూడా జగన్ చెప్పినట్లు వ్యవహరిస్తానని ఆమె అన్నారు.