
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయన పరిణామాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధుల రాజీనామాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని, పోరాటానికి ఊపు వస్తుందని తెలంగాణ పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. లాబీల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రోజుకో డ్రామా తో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంటోందన్నారు.
ఎన్డీయే నుంచి వైదొలిగాక అవిశ్వాసంపై అన్నిపార్టీలతో చంద్రబాబు మాట్లాడినట్టుగా కొన్ని మీడియాల్లో వచ్చిందని, ఎవరితో నూ మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారని తలసాని గుర్తుచేశారు. కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రధాని కలవడాన్ని చంద్రబాబు తప్పుబట్టడం హాస్యాస్పదమన్నారు.కేసులు చంద్రబాబుపై లేవా అని ప్రశ్నించారు. ప్రజోపయోగ అంశాలపై మాట్లాడకుండా కేసులని, మరొకటని బురదజల్లడం చంద్రబాబుకు తగదన్నారు.