ఎన్ని సీట్లు... ఎక్కడెక్కడ..?

Telangana Jana Samithi State meeting is Today - Sakshi

8 దాటని కాంగ్రెస్‌... 12కు తగ్గని కోదండరాం   

నేడు టీజేఎస్‌ రాష్ట్ర సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)లోని ఆశావహుల్లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటిపార్టీతో కలిసి ఏర్పాటవుతున్న మహాకూటమిలో టీజేఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి, అవి ఎక్కడెక్కడ వస్తాయనే అంశంలో స్పష్టత రాకపోవడంతో టీజేఎస్‌ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటిదాకా 8 సీట్లలో టీజేఎస్‌ అభ్యర్థులు పోటీచేయడానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. టీజేఎస్‌ కోరుతున్న స్థానాల్లో నాలుగు మాత్రమే ఇచ్చి, మిగిలిన నాలుగు సీట్లు మహాకూటమి బలహీనంగా ఉన్న స్థానాల్లో ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాత్రం తమకు 12 సీట్లు కేటాయించడంతో పాటు టీజేఎస్‌కు బలం ఉన్న నియోజకవర్గాల్లోనే అవకాశం ఇవ్వాలని పట్టు బడుతున్నారు.

ఇప్పటిదాకా తెలిసిన అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వరంగల్‌ తూర్పు, మిర్యాలగూడ, మల్కాజిగిరి, రామగుండం నియోజకవర్గాలను ఇవ్వడానికి కాంగ్రెస్‌పార్టీ అంగీకరించింది. వీటితోపాటు చాంద్రాయణగుట్ట, సిద్దిపేట, మలక్‌పేట, అశ్వారావుపేట నియోజకవర్గాలను టీజేఎస్‌కు ఇవ్వడా నికి అంగీకరించినట్టుగా తెలిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రెండేసి చొప్పున టీజేఎస్‌ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరుతున్నారు. 12 స్థానాలను కోదండరాం కోరుతున్నారు. బుధవారం రాత్రి లేదా గురువారానికి సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలు పూర్తిగా ఓ కొలిక్కి వస్తాయని టీజేఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

నేడు టీజేఎస్‌ రాష్ట్ర కమిటీ 
మహాకూటమితో జరుగుతున్న చర్చల వివరాలు, ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించడానికి టీజేఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం జరుగనుంది. ఇప్పటిదాకా జరిగిన చర్చల వివరాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలపై ఈ సమావేశంలో చర్చించి, భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top