‘కేసీఆర్‌ అలా మాట్లాడటం దురదృష్టకరం’ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఎన్నికల జ్వరం పట్టుకుంది : లక్ష్మణ్‌

Published Sat, Feb 23 2019 7:08 PM

Telangana BJP President Laxman Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రం ప్రభుత్వం, ఇతర పార్టీలపై విమర్శలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకొని మాట్లాడటం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ అన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై  చర్చ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడిన విధానం టీఆర్ఎస్ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనట్టుగా ఉందన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల జ్వరం పట్టుకుందని, అందుకే అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మట్లాడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందనడం దారుణం
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం సహకార సమాఖ్యకు పెద్దపీట వేస్తూ తెలంగాణ అభివృద్ధికి చేయూతను అందించిందని లక్ష్మణ్‌ చెప్పారు. దానిని విస్మరించి కేసీఆర్.. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుందనడం దారుణమన్నారు. అనేక పథకాలు, కార్యక్రమాల కింద కేంద్రం ఇచ్చిన నిధులకు తెలంగాణ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక వాటిని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఇక యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ)లు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించిన విషయాన్నీ ముఖ్యమంత్రిగారు మరచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు వస్తున్న కేంద్ర నిధులపై కేసీఆర్ మరోసారి అబద్ధాలు ఆడారని ఆరోపించారు. 

సభలోని లేనివారిపై ఆరోపణలు చేయడం సంప్రదాయాలకు విరుద్ధం
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై బీజేపీ బహిరంగ చర్చకు రావాలని గతంలో సవాల్ విసిరితే ముందుకు రాని కేసీఆర్ ఇప్పుడు అమిత్ షాపై అవాకులు చవాకులు పేలుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పిందే నిజమైతే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. శాసనసభలో లేని వ్యక్తి అమిత్ షాపై కేసీఆర్ ఆరోపణలు గుప్పించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. సభా సంప్రదాయాలు తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం సరైంది కాదన్నారు. దీనిని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంన్నారు.

మెదీకి పేరొస్తుందని..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పేరు వస్తుందని పేద కుటుంబానికి రూ.5 లక్షల మేర వైద్య సహాయం అందించే ‘‘ఆయుష్మాన్ భారత్’’ను తెలంగాణలో అమలు చేయక రాష్ట్రంలోని పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు రికార్డు స్థాయి తక్కువ వ్యవధిలో జారీ చేసిందన్నారు. జాతీయ రహదారులు, రైల్వేల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో మోదీ ప్రభుత్వంలోనే తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయాలను తన క్రెడిట్గా కేసీఆర్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించకపోవడంతో కేంద్రం నిధులు జారీ చేయలేకపోతే.. దానిని సాకుగా చూపి కేంద్రం రాష్ట్రంపై కుట్రలు పన్నిందనడం కేసీఆర్ నైజాన్ని బయటపెడుతోందని విమర్శించారు.

మహిళల సామర్థ్యాన్ని కేసీఆర్‌ కించపరిచారు
తాజాగా ప్రకటించిన మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ వారి సామర్థ్యాన్ని కించపరిచారని లక్ష్మణ్‌ విమర్శించారు. ఇద్దరు మహిళలను మంత్రివర్గంలో చేర్చుకుంటామని ఇప్పుడు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడం తప్పితే మరొకటి కాదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే గాక దానిని నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామాలను పరిపుష్టం చేస్తామన్న కేసీఆర్‌ మాటలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. మాయ మాటాలతో ప్రజలను కేసీఆర్‌ ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరన్నారు.

Advertisement
Advertisement