టీడీపీ ‘కాగడాల ప్రదర్శన’ హడావుడి

TDP Political Drama On No-confidence motion - Sakshi

సీఎం చంద్రబాబు గైర్హాజరు

ప్రదేశం: బందరు రోడ్డు బెంజిసర్కిల్‌ ప్రాంతం
సమయం: సాయంత్రం 5 గంటల సమయం
విషయం: ఒక్కసారిగా పోలీసులు రోడ్డు పైకి వచ్చి ట్రాఫిక్‌ ఆంక్షలు..
కారణం: సీఎం చంద్రబాబునాయుడు కాగడా ప్రదర్శనలో పాల్గొంటున్నారంటూ హడావుడి
ఫలితం: ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు
ముగిసిన సమయం: రాత్రి 8.15

సాక్షి, విజయవాడ: పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుండడంతో టీడీపీ అధినేత హైడ్రామాకు తెరతీశారు. రాష్ట్ర ఎంపీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కాగడా ప్రదర్శనలు చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. విజయవాడలో నిత్యం రద్దీగా ఉండి భారీ వాహనాలు రాకపోకలు సాగించే బెంజి సర్కిల్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ప్రకటించారు. 

క్షణాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు: శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ముగియడంతో ఇళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్న బెంజి సర్కిల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు కాగడా ప్రదర్శన నిర్వహిస్తారని తెలిసి డీవీ మ్యానర్‌ నుంచి బెంజి సర్కిల్‌ వరకు ట్రాఫిక్‌ను అనుమతించలేదు. అలాగే నిర్మలా కాన్వెంట్‌ నుంచి బెంజి సర్కిల్‌కు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బెంజి సర్కిల్‌కు, స్క్రూ బ్రిడ్జి నుంచి బెంజిసర్కిల్‌కు వాహనాలను అనుమతించలేదు. సందుల్లోకి, గొందుల్లోకి ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో నగర వాసులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. జాతీయ రహదారిపై కి.మీ మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఎటు వైపు నుంచి ఎటువైపు వెళ్లాలో తెలియక జనాలు చికాకు పడ్డారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి గైర్హాజరు: పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం పూర్తి కాలేదంటూ సీఎం చంద్రబాబు కాగడా ప్రదర్శనకు గైర్హాజరయ్యారు. దీంతో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడేప్రసాద్, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకూమారి, జిల్లా చైర్మన్‌ గద్దె అనూరాధ, ప్రత్యేక హోదా జేఏసీ ప్రతినిధి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top