టీడీపీలో వేరుకుంపట్లు

TDP Leaders Separate Decisions In Sattenapalli At Guntur - Sakshi

కోడెలను ఇన్‌చార్జిగా తొలగించాలని కోరినా  పట్టించుకోని చంద్రబాబు

తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న కోడెల అసమ్మతి వర్గీయులు

రంగబాబు, కోడెల వేర్వేరుగా సమావేశాలు   

సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే సత్తెనపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అప్పట్లోనే కోడెల మాకొద్దంటూ స్థానిక నేతలు రోడ్డెక్కారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు కోడెలకు టికెట్‌ ఇచ్చారు. ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలవడం.. కే ట్యాక్స్‌ బాధితులు పోలీసుస్టేషన్‌ మెట్లెక్కడంతో పార్టీ పరువు బజారున పడింది. ఇక కోడెల ఇన్‌చార్జిగా వద్దంటూ అసమ్మతి నేతలు అధినేత బాబును మళ్లీ కలిశారు. ఇదే సమయంలో రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు ప్రవేశం చేయడంతో సత్తెనపల్లిలో టీడీపీ రెండు ముక్కలైంది. ఇప్పుడు కోడెల వర్సెస్‌ రాయపాటి వర్గాల మధ్యపోరు సాగుతోంది.  

సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లా టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. ఇంటి పోరుతో ఆ పార్టీ సీనియర్, ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి టీడీపీలో కుమ్ములాటలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నరసరావుపేట మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రంగప్రవేశం చేశారు. ఆయన కోడెల అసమ్మతి వర్గానికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇప్పించడం కోసం రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు చేశారన్న విషయం తెలిసిందే.

కోడెల అసమ్మతి నాయకులు సైతం ఆయనవైపే అప్పట్లో మొగ్గు చూపారు. అయితే అధినేత చంద్రబాబు మాత్రం కోడెల శివప్రసాదరావుకే ఆ టికెట్‌ కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఐదేళ్లలో కోడెల కుటుంబం అక్రమాలు, అరాచకాలతో విసిగి వేసారిన సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కోడెలను నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించాలని బుధవారం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును కలిసి కోరారు. క్విట్‌ కోడెల.. సేవ్‌ సత్తెనపల్లి.. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బయట ఆందోళన జరుగుతున్న సమయంలో కోడెల సైతం కార్యాలయంలోనే ఉన్నారు. కొత్త ఇన్‌చార్జిని నియమించాలని కోడెల వ్యతిరేక వర్గ నాయకులు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో రాయపాటి రంగబాబు పేరు తెరపైకి వచ్చింది.

అసమ్మతి నాయకులతో భేటీ..
సత్తెనపల్లి పట్టణంలోని పాత నియోజకవర్గ టీడీపీ కార్యాలయంగలో రాయపాటి రంబాబు గురువారం కోడెల అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించారు. మరో వైపు తన మద్దతుదారులతో సొంత పార్టీ కార్యాలయంలో కోడెల సమావేశమయ్యారు. ప్రస్తుత ఈ వ్యవహారం టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కోడెలను పార్టీ ఇన్‌చార్జిగా తొలగించాలని అధినేతకు ఫిర్యాదులు అందిన వెంటనే రంగబాబు రావడం..  కోడెల వ్యతిరేకవర్గ నాయకులతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పథకం ప్రకారం రంగబాబే కోడెల అసమ్మతి నేతల వెనకుండి ఆందోళనలు చేయించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల మద్దతుదారులు సైతం రంగబాబే ఇదంతా చేయిస్తున్నారని కోపంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది.

ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి..
రాయపాటి, కోడెల ఇలా రెండు వర్గాలుగా సత్తెనపల్లి టీడీపీ చీలిపోవడంతో ఎటువెళ్లాలో తేల్చుకోలేని స్థితిలో ఆ పార్టీకి చెందిన తటస్థ శ్రేణులు ఉన్నాయి. మరో వైపు కొత్త ఇన్‌చార్జిని నియమించాలని చంద్రబాబును కోరినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోడెల అసమ్మతి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top